టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో నిందితుడు సింహాయాజీ బుధవారంనాడు ఉదయం చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. ఇదే కేసులో బెయిల్ మంజూరైనా రామచంద్రభారతి, నందకుమార్ లు మాత్రం జైల్లోనే ఉన్నారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సింహాయాజీ బుధవారంనాడు ఉదయం చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టు ఈ నెల 1వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు బెయిల్ మంజూరైన వారం రోజుల తర్వాత సింహాయాజీ జైలు నుండి విడుదలయ్యాడు.
మూడు లక్షల పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ప్రతి సోమవారంనాడు సిట్ ముందుకు రావాలని కూడా హైకోర్టు కోరింది. ముగ్గురు నిందితుల పాస్ పోర్టులను కూడా స్టేషన్ లో సరెండర్ చేయాలని కూడా హైకోర్టు తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు సింహాయాజీకి చెందిన న్యాయవాది పూచీకత్తును సమర్పించారు. దీంతో ఇవాళ ఉదయం చంచల్ గూడ జైలు నుండి సింహాయాజీని విడుదల చేశారు.ఇదే కేసులో బెయిల్ లభించినా కూడా ఇతర కేసులు ఉండడంతో రామచంద్రభారతి, నందకుమార్ లు జైల్లోనే ఉన్నారు.
undefined
also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: విచారణను రేపటికి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
ఈ ఏడాది అక్టోబర్ 26న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. ఈ కేసులో అదే రోజున ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది.
తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ ఆరోపించింది.ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.ఈ కేసు విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే సిట్ తో కాకుండా సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహిస్తుంది.ఈ విచారణ ఇవాళ కూడా కొనసాగుతుంది.
ఈ కేసుతో సంబంధం ఉందని కొందరిని సిట్ విచారించింది.కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక విషయాలను సిట్ బృందం గుర్తించింది. దీంతో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ , కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు జారీ చేసింది.ఈ కేసుకు సంబంధించి సిట్ జారీ చేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సిట్ నోటీసులపై ఈ నెల 13వ వరకు స్టే ఇచ్చింది హైకోర్టు.