చీకోటి ప్రవీణ్ కుమార్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లైసెన్స్ లేని ఆయుధాలను ఉపయోగించడంతో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు.
హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ కుమార్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు సోమవారంనాడు అరెస్ట్ చేశారు. లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకొనేందుకు ఈ నెల 16న చీకోటి ప్రవీణ్ కుమార్ వచ్చాడు. అయితే ప్రవీణ్ కుమార్ వద్ద పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ వద్ద ఆయుధాలను పోలీసులు గుర్తించారు. ఈ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
also read:లాల్‌దర్వాజ ఆలయానికి ప్రైవేట్ సెక్యూరిటీతో వచ్చిన చీకోటి: అడ్డుకున్న పోలీసులు
ఈ ఆయుధాలకు లైసెన్స్ ఉందా లేదా అనే విషయంపై విచారణ నిర్వహించారు.ఈ ఆయుధాలకు లైసెన్స్ లేదని పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేశారు. చీకోటి ప్రవీణ్ కుమార్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఏదో ఒక అంశంపై చీకోటి ప్రవీణ్ కుమార్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి కేసినో ఆడిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఏ ప్రాంతంలో కేసినోను అధికారికంగా నిర్వహిస్తారో అక్కడ తాను కేసినో వ్యాపారం నిర్వహిస్తానని చీకోటి ప్రవీణ్ కుమార్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
చీకోటి ప్రవీణ్ కుమార్ ను గతంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. కేసీనో విషయంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈడీ విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్ కుమార్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టుగా తెలిపారు. భవిష్యత్తులో ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు కానున్నట్టుగా చీకోటి ప్రవీణ్ కుమార్ ఈడీ అధికారులకు తెలిపారు.