హైదరాబాద్ మెట్రో 2019 ఎన్నికల కోసం ఆగుతున్నదా?

First Published Nov 9, 2016, 7:43 AM IST
Highlights

హైదరాబాద్   మెట్రో రైలు  ప్రారంభానికి మంచి ముహూర్తం  2019 ఎన్నికల దాకా  దొరకడం కష్టమని తెలిసిన వాళ్లు చెబుతున్నారు

హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైలు ఎటువెళ్తోంది?

 

మెట్రోరైలు మెల్లిమెల్లిగా 2019 వైపు నడుస్తూ ఉందని లోగుట్టు తెలిసిన వాళ్లు చెబుతున్నారు. తెలంగాణా ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు అందించే అతి పెద్ద కానుకగా   2019 ఎన్నికల ముందు, టిఆర్ఎస్  ప్రభుత్వం హైదరాబాద్  మెట్రోని కనివిని ఎరుగని రీతిలో ప్రారంభిస్తారని విశ్వసనీయంగా తెలిసింది.

 

అంతవరకు ఎవరికీ అర్థం కాని రీతిలో, ఏవో అనూహ్యమయిన కారణాలతో, అక్కడ కోర్టు కేసులతో, మరికొన్ని చోట్ల స్థలసేకరణ జాప్యాలతో, మధ్య మధ్య మంచి ముహూర్తం దొరకక ప్రారంభోత్సవాన్ని 2018 చివరి దాకా  లాక్కెళ్లాలని   అనుకుంటున్నట్లు  తెలిసింది.

 

ఎటుకాకుండా, ఏ మాత్రం రాజకీయ ప్రయోజనం కల్గించని అకాలంలో, భారత దేశంలోనే పెద్దదయిన ప్రాజక్టును, ప్రపంచంలోనే పొడవయిన ఎలివేటెడ్ రైలు (స్తంభాలమీద నడిచేది) ప్రాజక్టును ప్రారంభించడం రాజకీయంగా మంచిది కాదని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇంత పెద్ద ప్రాజక్టు ప్రారంభోత్సవాన్ని  2017 లోనో, 2018 ఆరంభంలోనో ప్రారంభిస్తే ఒక భారీ ప్రాజక్టు వృధా అయినట్లే నని,అలా నిష్ప్ర యోజనంగా 20,000  వేల కోట్ల విలువయిన ప్రాజక్టును ప్రారంభించకూడాదనే భావం పార్టీ వర్గాల్లో బలంగా ఉందని చెబుతున్నారు.

 

అందువల్ల  టిఆర్ ఎస్  ప్రభుత్వానికి భారీ  ప్రయోజనం చేకూర్చే రీతిలో ఈ  ప్రాజక్టు ప్రారంభోత్సవ  ముహూర్తం  ఎంపిక చేస్తారని, అది  2019 ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి నాలుగయిదు నెలల ముందు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.

 

ఉగాదనో , తెలంగాణా రాష్ట్రావతరణ దినోత్సవమనో ఒక ఏడాది ముందే 2017 లో ప్రారంభిస్తే, 2019సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రజలు  ఆ సోదే మర్చి పోయే ప్రమాదం ఉంది.  ప్రాజక్టు ప్రభావం ప్రజల మీద ఎల్లకాలం ఉండదు కదా. కాబట్టి ఈ  ప్రాజక్టును కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కాంట్రవర్సీల నుంచి బయటకు లాగి,  చివరకుకంప్లీట్ చేయగలిగామని, అది కూడా టిఆర్ ఎస్ ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందనే సందేశం తెలంగాణా ఓటర్లలో ముఖ్యంగా హైదరాబాద్ ఓటర్ల మనసుల్లో నాటుకుపోయేంత అట్ట హాసంగా ప్రారంభిస్తారని   తెలుస్తున్నది.

 

మెట్రో ఎండి ఎన్వీయస్ రెడ్డి  తరచూ చేసే ’త్వరలో విడుదల’ ప్రకటనలన్నీ మెట్రో దెబ్బకు తలకిందులయిపోయి, ట్రాఫిక్ లో  నరక యాతన అనుభవిస్తున్న  హైదరాబాద్  ప్రజలకు బతుకు మీద ఆశ చావకుండా ఉండేందుకు మానవతా దృక్పధంతో చెబుతున్న ప్రవచనాలే నట.  “వచ్చే ఏడాది ఉగాది (మార్చి 28)కి గానీ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) నాడు గానీ పట్టాలెక్కి హైదరాబాద్ లో మెట్రోరైల్ హల్ చల్ చేస్తుంది,” అని రెడ్డి గారు నిన్న చెప్పడం ఇందులో భాగమేనట.

 

మెట్రో రైల్ నిర్మాణంపై ఎలాంటి అపోహలూ, అనుమానాలు వద్దని, అనుకున్న సమయానికి కాస్త ఆలస్యమైనా పూర్తి చేసి తీరతామని ఆయన గట్టి భరోసా ఇచ్చారు. ఎల్ అండ్ టీ వారు 2017 జూ లై నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముందు గా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ... కోర్టు కేసులు, ఆస్తుల స్వాధీనంలో తలెత్తిన సమస్యల వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. 2018 నాటికి పూర్తి ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అదీ సంగతి. ఈ క్లారిఫికేషన్తో  మెట్రోని 2019 దాకా లాగిస్తూ పోవచ్చు.

 

 

click me!