
యాదాద్రి అంజనేయ స్వామి ఎలా రూపు దిద్దుకుంటున్నారో పరిశీలించి రమ్మని అధికారులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తెలంగాణా యాదగిరి గుట్ట సర్వాంగ సుందరంగా అక్షరాల యాదాద్రిగా మార్చే కొత్త మాస్టర్ ప్లాన్ సిద్దమయింది.
మాస్టర్ ప్లాన్ ఎలా అమలు చేయలనేదాని మీద ముఖ్యమంత్రి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఇందులో భాగంగా యాదాద్రిలో ప్రతిష్టించనున్న అతి పెద్ద హనుమంతుడి విగ్రహం ఎలా ఉండాలి? ఎత్తు ఎంత ఉండాలి? ఏ లోహంతో చేయాలి? తదితర అంశాలను పరిశీలించడానికి చైనా వెళ్లి అక్కడ తయారు చేస్తున్న కంపెనీతో మాట్లాడాలని పురమాయించారు. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు చైనీయులు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
యాదాద్రి డవలప్‌మెంట్ అథారిటీ (వైటిడిఏ) ఈ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. తెలంగాణా తిరుపతి లాగా రూపు దిద్దుకుంటున్న ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది కాబట్టి వారి కోసం యాదాద్రిలో 300 వసతి గృహాలను నిర్మించాలని వైటిడిఏ నిర్ణయించింది.
ఇందులో 100 గదులు ఎసి రూములు, 100 నాన్ ఎసి గదులు, 100 ఉచిత రూములతో పాటు డార్మెటరీలు నిర్మించడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. యాదాద్రి మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై ముఖ్యమంత్రి మరికొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలపై అధికారులు మంగళవారం నుంచి కసరత్తు ప్రారంభించారు. యాదాద్రిలో కాటేజీల నిర్మాణం కోసం అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారని, వారి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆదేశాలు:
1. దాతల ఆర్థిక సాయంతో నిర్మించబోయే కాటేజీలు సారూప్యత కోసం విరాళాలను బట్టి ఐదు కేటగిరీలుగా విభజించాలి. వీటిలో రూ.కోటి, 50 లక్షలు, 25 లక్షలు, 10 లక్షలు, 5 లక్షల వ్యయంతో ఐదు కేటగిరీలలో గదుల నిర్మాణం చేసి వాటికి దాతల పేర్లు పెట్టాలి.
2. ప్రధాన గుట్టపై సుమారు 2000 కార్లు పార్క్ చేసే విధంగా మల్టిలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి పార్కింగ్ స్థలం నుంచి గుట్టపైకి చేరుకోవడానికి ఎస్కలేటర్స్ ఏర్పాటు చేయాలి.
3.ప్రధాన గుట్టకు సమీపంలో 75 ఎకరాల స్థలంలో అత్యవసర, ముఖ్యమైన సేవలు అందించే విభాగాలు ఉంటాయి. ఇందులో 30 ఎకరాలలో కార్ల పార్కింగ్, 10 ఎకరాలలో బస్సుల పార్కింగ్, 35 ఎకరాలలో బస్ డిపో, పోలీస్, ఫైర్, కమర్షియల్ కాంప్లెక్స్, ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలి.
4. ఆలయం సమీపంలో మరో చోట 25 ఎకరాలలో పూలతోట, 50 ఎకరాలలో కళ్యాణ మంటపం, ప్రవచన వేదిక నిర్మించాలి.
5. గుట్టపై నుంచి కిందికి డ్రైనేజి వ్యవస్థ, వ్యర్థ పదార్థాల విసర్జన కోసం ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మించాలి. దర్శనం సజావుగా కచ్చితమైన వేళలకు జరిగే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాఫ్ట్‌వేర్ తయారు చేయాలి. భక్తులకు మంచి వసతి సౌకర్యాలు కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా ప్రణాళిక ఉండాలి .