అయోధ్యలో కొలువుదీరనున్న అందాల రామయ్య కోసం హైదరాబాదీ కళాకారుడు సుందరమైన పాదుకలను సిద్దం చేసాడు.
హైదరాబాద్ : అయోధ్యలో అత్యంత సుందరంగా నిర్మితమైన రామయ్య ఆలయం త్వరలోనే ప్రారంభం కానుంది. దేశంలోని మెజారిటీ ప్రజలు ఆ అయోధ్య రామయ్యను దర్శించుకుందామని... ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయ అందాలను కనులారా చూద్దామని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఆలయ ప్రారంభోత్సవానికి శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సుముహూర్తం ఖరారు చేసింది. అయోధ్య ఆలయాన్ని ఈ నెల(జనవరి) 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే అయోధ్య ఆలయంలో వుండే ప్రతీదాన్ని కళాత్మకంగా తయారుచేయిస్తోంది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇలా ఇప్పటికే ఆలయ ద్వారాలను తయారుచేసే భాగ్యం హైదరాబాద్ కు దక్కగా తాజాగా స్వామివారి పాదాలను చేసే మహద్భాగ్యం కూడా ఓ హైదరబాదీకి దక్కింది. సికింద్రాబాద్ బోయినిపల్లికి చెందిన పిట్లంపల్లి రామలింగాచారి అయోధ్య రామయ్య పాదుకలను అద్భుతంగా తీర్చిదిద్దారు. 15 కిలోల పంచలోహాలతో ఈ పాదుకలను తయారుచేసినట్లు రామలింగాచారి తెలిపారు.
అయోధ్య ఆలయ అందాలను మరింత పెంచేలా రామయ్య పాదుకలు కళాత్మకంగా రూపొందించారు. ఈ పాదుకలు రామయ్య పాదాలను తాకి మరింత అందాన్ని పొందునున్నాయి. అయోధ్య రామయ్య పాదుకలను తరయారుచేసే అవకాశం హైదరాబాద్ కళాకారుడికి దక్కడం యావత్ తెలుగు ప్రజలకు గర్వకారణం.
Also Read Ayodhya Temple : హైదరబాద్ ద్వారాలు దాటితేనే అయోధ్య రామయ్య దర్శనం...
అయోధ్య భాగ్యనగర సీతారామ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసశాస్త్రి కోటి రూపాయలకు పైగా వెచ్చింది ఈ పాదుకలను తయారుచేయించారు. ఈ పాదుకల తయారీకి 8 కిలోల వెండితో తయారుచేసి కిలో బంగారంతో తాపడం చేసారు. ఈ పాదుకలను ఇవాళ విమానంలో అయోధ్యకు తీసుకెళ్లనున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు రామయ్య పాదుకలను అందించనున్నట్లు సమాచారం.
ఇక అయోధ్య ఆలయంలో రామయ్య కొలువయ్యే గర్భగుడితో పాటు ప్రాంగణంలో ఏర్పాటుచేసే అన్ని ద్వారాలు తయారుచేసే అవకాశం సికింద్రాబాద్ లోని అనురాధ టింబర్ ఎస్టేట్ కు దక్కింది. అయోధ్యలోనే ప్రత్యేకంగా ఓ కర్మాగారాన్ని ఏర్పాటుచేసుకుని మరీ ఆలయ ప్రధాన ద్వారంతో పాటు మిగతావాటిని సుందరంగా చెక్కారు కార్మికులు. ఇప్పటికే ద్వారాలు, తలుపుల తయారీ పూర్తవగా వాటిని ఆలయంలో బిగించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.