
Jubilee Hills Bypoll 2025 : తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అకాలమరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నికకు ఇటీవలే షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానిప్రకారమే అక్టోబర్ 13న అంటే ఇవాళ(సోమవారం) అధికారికంగా ఎన్నిక ప్రక్రియను ప్రారంభించింది ఎలక్షన్ కమీషన్. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది ఈసి... దీంతో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అయ్యింది.
అక్టోబర్ 13 (సోమవారం) - నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
అక్టోబర్ 21 (మంగళవారం) - నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ
అక్టోబర్ 22 (బుధవారం) - నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 24 (శుక్రవారం) - నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ
నవంబర్ 11 (మంగళవారం) - పోలింగ్
నవంబర్ 14 (శుక్రవారం) - జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినా హైదరాబాద్ లో మాత్రం భారత రాష్ట్ర సమితి హవా సాగింది. నగరపరిధిలో అత్యధిక స్థానాలు బిఆర్ఎస్ దక్కించుకుంది... ఇలా జూబ్లిహిల్స్ నుండి మాగంటి గోపినాథ్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసుకున్నారు. కానీ ఇటీవల అతడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు... దీంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉపఎన్నిక వచ్చింది.
ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతను ఉపఎన్నిక బరిలో నిలిపింది. అధికార కాంగ్రెస్ గతకొన్ని పర్యాయాలుగా ఇదే జూబ్లీహిల్స్ నుండి పోటీచేసి ఓడిపోతూ వస్తున్న నవీన్ యాదవ్ కు మరోసారి అవకాశం ఇచ్చింది. అతడు ఇప్పటివరకు ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగగా ఈ ఉపఎన్నిక ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
అధికార కాంగ్రెస్ నుండి పోటీచేస్తున్న నవీన్ యాదవ్ కు ఈసారి విజయం వరిస్తుందా? లేదంటే మాగంటి సునీత మొదటిసారి ఎమ్మెల్యే అవుతారా? అన్నది త్వరలోనే తేలనుంది. ఇప్పటికయితే ఇరువురి మధ్య గట్టి పోటీ నెలకొంది. బిజెపి ఇంకా అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన పడుతోంది.