పాతబస్తే అసలైన హైదరాబాద్.. హైకోర్టును అక్కడి నుంచి తరలించొద్దు - అసదుద్దీన్ ఒవైసీ..

By Sairam Indur  |  First Published Dec 25, 2023, 11:06 AM IST

తెలంగాణ హైకోర్టు (telangana high court) భవనాన్ని పాత బస్తీ (old city) నుంచి తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వ నిర్ణయాన్ని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తప్పుబట్టారు. పాత బస్తీ అసలైన హైదరాబాద్ అన్నారు. ఇక్కడి నుంచి హైకోర్టును తరలించకూడదని కోరారు. 


పాతబస్తే అసలైన హైదరాబాద్ అని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ హైకోర్టును అక్కడి నుంచి తరలించొద్దని చెప్పారు. అవసరమైతే చంచల్ గూడ జైలును హైదరాబాద్ శివార్లకు తరలించాలని సూచించారు. ఆ స్థలాన్ని హైకోర్టు నూతన భవనానికి వినియోగింకోవాలని కోరారు. ఏఐఎంఐఎం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధిక విలువగల బుద్వేల్ లో కొత్త హైకోర్టును ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని చెప్పారు. దాని నిర్మాణానికి కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.

ration cards : కొత్త రేషన్ కార్డులు మరింత ఆలస్యం.. కారణమేంటంటే ?

Latest Videos

అలాగే సెంట్రల్ ఆర్మ్ డ్ రిజర్వ్ ను పేట్లబుర్జ్ నుంచి తరలించాలని ఒవైసీ సూచించారు. ఆ భూమిని కేజీ టు పీజీ క్యాంపస్ కు వినియోగించాలని కోరారు. పాతబస్తీ అభివృద్ధే ముఖ్యమైతే ఇక్కడ ఉన్న హైకోర్టును ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి తరలించాలని భావిస్తున్నారని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ప్రాముఖ్యత ఉన్న ప్రతీ సంస్థను అసలైన హైదరాబాద్ నుంచి తరలించారని ఆరోపించారు. అసలైన హైదరాబాద్ ను రాజధానిలో భాగం కాని బంజరు ప్రాంతంగా చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

పాతబస్తీ ప్రజలు విద్యుత్ చౌర్యం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి నిందలు వేయడం గర్హనీయమని ఒవైసీ మండిపడ్డారు. గిరిజనులు, దళితులు, ముస్లింలు నివసిస్తున్న ప్రాంత ప్రజలను కించపరిచే అర్హత ఏ సీఎంకు ఉండకూడదని చెప్పారు. 1984లో భాస్కర్ రావు ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతిచ్చిన విషయాన్ని కూడా అసదుద్దీన్ గుర్తుచేశారు. తన తండ్రి, అప్పటి ఎంఐఎం అధ్యక్షుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ బహిరంగ సభ నిర్వహించారని, అందులో రావు వర్గానికి పార్టీ మద్దతు ఇవ్వాలా అని హైదరాబాద్ ప్రజలను కోరారని చెప్పారు. తరువాతే మద్దతు ప్రకటించారని తెలిపారు.

ఎలుక ముక్కు కొరికడంతో 40 రోజుల చిన్నారి మృతి

కానీ ఆ సమయంలో తాము మంత్రి పదవి గానీ, డబ్బు గానీ అడగలేదని చెప్పారు. తాము ఇచ్చిన మద్దతు వల్ల దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డీసీఎంఎస్) అనే మైనారిటీ విద్యాసంస్థ ఏర్పాటుకు అనుమతి లభించిందని అన్నారు. దానిని స్థాపించేందుకు ఆయన కష్టపడ్డారని, అదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రోగులకు సేవలందింస్తున్న 5000 మందికి పైగా వైద్యులను తయారు చేసిందని చెప్పారు. డీసీఎంఎస్ పూర్వ విద్యార్థులు లక్షలాది మందికి సాయం చేశారన్నారని గుర్తు చేశారు. 

ఎంఐఎం బీజేపీని ఓడిస్తోందని, ఎప్పటికీ ఓడిస్తూనే ఉంటుందని ఒవైసీ అన్నారు. మోడీ మళ్లీ ప్రధాని కాకుండా ఉండే ప్రతీ ప్రయత్నానికి తాము మద్దతు ఇస్తామని చెప్పారు. తాము ఎక్కడ నిలబడతామో ఇతర పార్టీలు నిర్ణయించుకోవాలని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. బీజేపీని ఓడించాలనుకుంటే రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో ఎందుకు గెలిపించారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 65 లోక్ సభ స్థానాలు ఉన్నాయని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీకి ఎందుకు అవకాశం ఇచ్చారని దుయ్యబట్టారు.

click me!