ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ ధర్నాకు హైకోర్టు అనుమతి

By Mahesh RajamoniFirst Published Jan 5, 2023, 12:30 PM IST
Highlights

Hyderabad: హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని సర్పంచుల సమస్యలను ఎత్తిచూపుతూ నిరసన తెలపడానికి కాంగ్రెస్ పార్టీ ధ‌ర్నాకు అనుమతి కోరింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేటాయించాల్సిన నిధులను ప్రభుత్వం తమకు తెలియకుండా పక్కదారి పట్టించిందని కొందరు సర్పంచ్‌లు ఆరోపించారు.
 

Congress dharna at Indira park: రాష్ట్రంలోని సర్పంచులు, పంచాయతీల సమస్యలపై పోరాటం సాగించ‌డానికి కాంగ్రెస్ సిద్ధ‌మైంది. స‌ర్పంచుల స‌మ‌స్య‌ల‌ను ఎత్తిచూపుతూ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఇందిరా పార్కు వ‌ద్ద రాష్ట్రంలోని స‌ర్పంచులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. వాటిని ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ నిరసన తెలపడానికి కాంగ్రెస్ పార్టీ ధ‌ర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

వివరాల్లోకెళ్తే.. ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ధర్నాకు దిగేందుకు తెలంగాణ హైకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ ధ‌ర్నాకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను న్యాయ‌స్థానం ఆదేశించింది. ధర్నా తేదీ, సమయాన్ని తెలియజేస్తూ పోలీసులకు తాజా ప్రాతినిధ్యాన్ని సమర్పించాలని పిటిషనర్‌ను కోరింది. లంచ్ మోషన్ కేసును విచారించిన బెంచ్ సింగిల్ జడ్జి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్నాలో 300 మందికి మించకుండా చూడాలని పిటిషనర్‌ను ఆదేశించారు. పిటిషనర్ కోవిడ్-19 ప్రోటోకాల్‌ను అనుసరించాలనీ, ధ‌ర్నా స‌మ‌యంలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల క్ర‌మంలో వారు పోలీసులకు సహకరించాలని కూడా ఆదేశించబడింది.

కాగా, ఇటీవ‌ల స‌ర్పంచులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఎత్తిచూప‌డానికి కాంగ్రెస్ ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలోనే ప‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వహించే ప్ర‌య‌త్నం చేసింది. అయితే, కాంగ్రెస్ ధర్నాకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ కుమార్‌ గౌడ్‌ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలోని సర్పంచ్‌ల సమస్యలపై నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ అనుమతి కోరింది. తిరస్కరణ ఉత్తర్వు స్వభావరీత్యా ఏకపక్షమని, రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. అయితే ప్రజల అసౌకర్యం దృష్ట్యా అనుమతి ఇవ్వడాన్ని ప్రభుత్వ ప్లీడర్ వ్యతిరేకించారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తన తీర్పును కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రకటించారు. కాంగ్రెస్ ధ‌ర్నాకు అనుమ‌తులు ఇవ్వాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. 

అంత‌కుముందు, పంచాయతీ రాజ్ సంస్థలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన నిరసనకు పోలీసుల అనుమతి నిరాకరణను కోర్టులో సవాలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. పంచాయతీ రాజ్ సంస్థలకు మంజూరైన నిధులను దారి మళ్లించారన్న వార్తల నేపథ్యంలో మంగళవారం ధర్నా చౌక్ వద్ద సర్పంచ్ ల‌తో  కలిసి నిరసన తెలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, పోలీసులు అభ్యర్థనను తిరస్కరించారు. ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే తన ప్రాథమిక హక్కును పోలీసులు కాలరాస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఏకపక్ష, చట్టవిరుద్ధమైన నిర్బంధాలకు వ్యతిరేకంగా ఆదేశాలు కోరుతూ ఈ సమస్యలను పార్టీ కోర్టు దృష్టికి తీసుకువస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు పోలీసులు పెద్దఎత్తున మోహరించి వారిని బయటకు రానివ్వకుండా గృహనిర్బంధంలో ఉంచారు. రేవంత్ రెడ్డి వంటి నేతలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వస్తున్న తనను ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఇంటి దగ్గర కాకుండా ధర్నాలో పాల్గొంటే పోలీసులు ధర్నా చౌక్‌లో అరెస్టు చేయవచ్చని అన్నారు. తనను కలిసేందుకు వచ్చిన కార్పొరేటర్ విజయారెడ్డిని అరెస్టు చేయడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఇందిరాపార్కు వైపు వెళ్లకుండా పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో గాంధీభవన్ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసి గేట్లపై నుంచి విసిరేశారు.

click me!