గెటెడ్ కమ్యూనిటీనా లేక విదేశీ సరిహద్దా? హైదరాబాద్‌లో వైరల్ అవుతున్న అంకుల్ వీడియో !

Published : Mar 30, 2026, 09:45 PM IST
Hyderabad Gated Community President Bars Woman Entry Despite Gate Pass

సారాంశం

Hyderabad : హైదరాబాద్ కొండాపూర్‌లోని ఒక గెటెడ్ కమ్యూనిటీలో స్నేహితులను కలవడానికి వచ్చిన యువతిని అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్డుకున్న వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్న కామెంట్లతో రచ్చ లేపారు.

Hyderabad Gated Community: హైదరాబాద్‌లోని గెటెడ్ కమ్యూనిటీలలో సందర్శకుల నిబంధనలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్‌కు ఎదురుగా ఉన్న ఆదిత్య హైట్స్ అపార్ట్మెంట్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వసంతి సింగంపల్లి అనే ఫుడ్ బ్లాగర్, తన స్నేహితులను కలవడానికి ఈ అపార్ట్మెంట్‌కు వెళ్లగా, అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆమె వద్ద ఎంట్రీకి అవసరమైన గేట్ పాస్ ఉన్నప్పటికీ, నిబంధనల అతిక్రమణ పేరిట ఆమెను అవమానించారని బాధితురాలు ఆరోపించారు.

బంధువులకు మాత్రమే ప్రవేశం: ప్రెసిడెంట్ కొత్త రూల్

బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం, ఆమె అపార్ట్మెంట్‌లోని ఇద్దరు స్నేహితులను కలవడానికి వెళ్లారు. నిబంధనల ప్రకారం గేట్ పాస్ పొందినప్పటికీ, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆమెను గేటు వద్దే ఆపివేశారు. "ఈ అపార్ట్మెంట్‌లో బంధువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది, అది కూడా రక్త సంబంధీకులమని నిరూపించే ఆధారాలు చూపాలి" అని ఆయన కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు. గేట్ పాస్ ఉన్న విషయాన్ని గుర్తు చేయగా, వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేసి ఆ పాస్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. "నేనే ప్రెసిడెంట్‌ని, ఇక్కడ నా రూల్స్ మాత్రమే నడుస్తాయి" అని ఆయన దురుసుగా ప్రవర్తించారని వసంతి పేర్కొన్నారు. సుమారు 40 నిమిషాల పాటు గేటు వద్దే వేచి చూసేలా చేశారని, అందరి ముందు తనను హేళన చేస్తూ మాట్లాడటంతో తాను కన్నీటి పర్యంతమయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు: భద్రత వర్సెస్ స్వేచ్ఛ

ఈ వీడియో వైరల్ కావడంతో ఇంటర్నెట్ లోకం రెండుగా చీలిపోయింది. ఒక వర్గం నెటిజన్లు ప్రెసిడెంట్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. "కొంతమంది అంకుల్స్ అపార్ట్మెంట్‌ను కొన్నట్లు కాకుండా, తామే కట్టించి అందరికీ యజమానులైనట్లు ప్రవర్తిస్తారు" అని ఎద్దేవా చేస్తున్నారు. అద్దెకు ఉండే వారికి కనీస గౌరవం ఇవ్వకపోవడంపై మరికొందరు మండిపడుతున్నారు.

అయితే, మరో వర్గం మాత్రం ప్రెసిడెంట్ నిర్ణయాన్ని సమర్థిస్తోంది. గెటెడ్ కమ్యూనిటీలలో నివాసితుల భద్రత దృష్ట్యా కఠినమైన నిబంధనలు ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులను అనుమతించకపోవడమే మంచిదని వారు వాదిస్తున్నారు. ఈ ఘటన గెటెడ్ కమ్యూనిటీలలో వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రత మధ్య ఉన్న సన్నని గీతపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్ లో అప్పుడే నీటి కష్టాలు.. తక్కువ ధరలో వాటర్ ట్యాంకర్ బుక్ చేసుకోండిలా..
Hyderabad లో బైక్ ఉంటే చాలు... నెలనెలా ఈజీగా రూ.60,000 సంపాదించవచ్చు