చేప మందు ప్రసాదం: జూన్ 8 నుంచి చేప మందు పంపిణీ. ఈ మందుతో ఉబ్బసం పోతుందా?

ఆస్తమా రోగులకు ప్రసిద్ధి చెందిన చేప ప్రసాదం ఈసారి జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లిలో జరుగనుంది. లక్షలాది మంది హాజరయ్యే అవకాశముంది.

Google News Follow Us

హైదరాబాద్‌ వేదికగా ప్రతి ఏడాది నిర్వహించే ప్రసిద్ధ ఆయుర్వేద పద్ధతిలో చేప ప్రసాదం పంపిణీకి తేదీలు ఖరారయ్యాయి. ఈసారి జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం కలిగించే ఈ సంప్రదాయ చికిత్సలో పాల్గొనేందుకు లక్షలాది మంది రోగులు రావాల్సిన అవకాశముందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.దశాబ్దాలుగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ వస్తోన్న బత్తినీ కుటుంబం ఈ కార్యక్రమాన్ని సేవా భావంతో నిర్వహిస్తోంది. వారు పేర్కొన్నట్టు ఈసారి సుమారు 5 నుంచి 6 లక్షల మంది రోగులు హాజరవుతారని భావిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల నుంచీ అనేక మంది రోగులు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

ఈ చేప ప్రసాదం విధానం ప్రత్యేకంగా ఉంటుంది. చిన్న చేపలో ఓ ఆయుర్వేద మందును ఉంచి రోగి మింగేలా చేస్తారు. దీన్ని తీసుకునే ముందు, తరువాత కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకి, మాంసాహారం మానేయడం, కొన్ని రోజులపాటు ప్రత్యేక ఆహారం తీసుకోవడం అవసరం.ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో వచ్చే రోగులకు అనుగుణంగా క్యూలైన్లు, తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.ఈ సంప్రదాయ చికిత్సను కొందరు వైద్య నిపుణులు స్వీకరించకపోయినా, అనేక మంది దీన్ని ఒక ఆశాజ్యోతి లా భావిస్తున్నారు. ఆధునిక వైద్యం పనిచేయని సందర్భాల్లో అలాంటి ప్రత్యామ్నాయ చికిత్సల వైపు మొగ్గుచూపుతున్నారు.ప్రతి ఏడాది జరిగే ఈ కార్యక్రమం బత్తినీ కుటుంబం అందించే నిస్వార్థ సేవకు ప్రతీకగా మారింది. ఈసారి కూడా ప్రభుత్వ సహకారంతో మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నారు.

 

వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్సు

ఇటీవ‌ల ఆస్త‌మా వ్యాధి చాలా మందిని వేధిస్తోంది. మ‌నం గ‌మ‌నిస్తే పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కూ ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా ప్ర‌స్తుత జీవ‌న శైలి, పెరుగుతున్న వాయు కాలుష్యం, పట్టణ జీవితం వంటి అంశాలు ఆస్త‌మా కేసులు పెర‌గ‌డానికి ముఖ్య కార‌ణాలు అవుతున్నాయి. ఇది ఊపిరితిత్తుల్లో త‌లెత్తే ఇబ్బంది. ఆస్త‌మా ఉన్న‌ప్పుడు శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది, ఛాతి బిగుసుకుపోతుంది, దానితోపాటు దగ్గు, తుమ్ములు, జ‌లుబు వంటి లక్ష‌ణాలు క‌నిపిస్తాయి. చ‌లి కాలంలో అయితే దీనివ‌ల్ల బాగా ఇబ్బంది ప‌డ‌తారు.

ఈ వ్యాధి వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్సుంది. పిల్ల‌ల‌లో చిన్న‌త‌నంలోనే మొద‌లై, స‌రైన చికిత్స లేకుండా ఉంటే, పెద్ద‌య్యాకా కూడా అదే స‌మ‌స్య కొన‌సాగే ప్రమాదం ఉంటుంది. కొంద‌రిలో వ‌య‌సు పెరిగేకొద్దీ స‌ర్దిపోతుంది కానీ అంద‌రిలో అలానే జరగనిది.

ఆస్త‌మా రావ‌డానికి కార‌ణాలు చాలా ఉంటాయి. పొగ, దుమ్ము, వాస‌న‌లతో నిండిన ప‌రిస్థితులు, చ‌ల్ల‌ని ఆహారం, ఫ్రిజ్ వాట‌ర్‌, బాడీ స్ప్రేలు, దోమల కొయ్యిల్స్‌, ఫ్లవ‌ర్స్ పుప్పొడి వాస‌న‌లు, పెంపుడు జంతువుల జుట్టు వంటివి దీనికి దోహదం చేస్తాయి. కొన్ని మందులు, తినే పదార్థాలు కూడా అలెర్జీకి కారణమవుతూ ఈ సమస్యను మ‌రింత పెంచుతాయి.

ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అందుకే క్రమం తప్పకుండా మందులు వాడడం చాలా అవసరం. ఆయాసం లేదంటే మందులు మానేయ‌డం చాలా పొర‌పాటు. ఎందుకంటే లోపల శ్వాసనాళాల్లో నెమ్మ‌దిగా మార్పులు వ‌చ్చి శాశ్వతంగా మిగిలిపోతాయి. ఆ మార్పులు త‌ర్వాత శ్వాస సమస్యలను మరింత బిగింతగా మార్చేస్తాయి. అందుకే వైద్యుడు చెప్పిన విధంగా మందులు వాడుతూ ఉండాలి.

ఆస్త‌మా ఉన్న పిల్లలు కూడా మిగిలిన పిల్లల మాదిరిగానే సాధారణ జీవితాన్ని గడపవచ్చు. పెరుగుదలలోనూ తేడా ఉండ‌దు. ఈ వ్యాధిని జాగ్రత్తగా నియంత్రిస్తే, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గకుండా, ఆరోగ్యంగా ఉండ‌గ‌ల‌గుతారు.

ఇంకా చాలా మందికి ఓ అపోహ ఉంది. చేప మందు వాడితే ఆస్త‌మా పోతుంద‌న్న భావ‌న. కానీ దీన్ని మ‌రియు వైద్యులు ఖండిస్తున్నారు. శాస్త్రీయంగా చూస్తే, చేప మందుతో ఆస్తమా తగ్గుతుందన్న ఎటువంటి ఆధారాలు లేవు. కొంత‌మందిలో దానికి ప్రతికూల ప్రభావాలే ఎక్కువ‌గా ఉంటాయి. కాబట్టి అటువంటి మార్గాల వైపు వెళ్లడం అంత మంచిది కాదు.

ఆస్త‌మా ఉన్నవాళ్లు వ్యాయామం మానేయ‌డం కాదు, మ‌రింత చేస్తే మంచిదే. శ‌రీరంలో రక్త ప్రసరణ బాగుంటే, ఊపిరితిత్తులకు ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. ఇలా ఉండ‌టం వ‌ల్ల ఆస్త‌మా ఎటాక్స్ తగ్గుతాయి. అదే విధంగా యోగా, ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు శరీరానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటివల్ల శ్వాసను నియంత్రించే శ‌క్తి పెరుగుతుంది. ఒత్తిడి త‌గ్గుతుంది.

ఇంకో ముఖ్యమైన విషయం, ఆస్త‌మాకు స్పెసిఫిక్‌గా ఎటువంటి వ్యాక్సిన్ లేదు. కానీ ఫ్లూ వచ్చినప్పుడు ఆస్త‌మా ఎక్కువ‌గా అవుతుంది కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ వేయించ‌డం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి అన్ని చూస్తే, ఆస్త‌మా అనేది పూర్తిగా పోతుంది అనే చెప్ప‌డం క‌ష్టం. కానీ దాన్ని పూర్తిగా నియంత్రించ‌డం మాత్రం సాధ్యమే. ఇందుకోసం ముందుగానే లక్షణాలు గుర్తించి, వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ, జీవనశైలిలో మార్పులు తీసుకురావడం చాలా అవసరం.

 

 

Read more Articles on