Hyderabad fire tragedy: హైదరాబాద్‌లోని గుల్జార్ హౌజ్ మంటలకు కారణమేంటి?

Published : May 19, 2025, 02:49 PM IST
Gulzar House hyderabad fire

సారాంశం

Hyderabad fire tragedy: హైదరాబాద్ చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారంద‌రూ ఒకే కుటుంబంలోని వారు కాగా, వీరిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. 

Hyderabad fire tragedy: హైద‌రాబాద్ నగరాన్ని శోకసంద్రంగా ముంచిన ఘోర అగ్నిప్రమాదంలో మృతిచెందిన ప్రహ్లాద్‌మోదీ కుటుంబానికి చెందిన 15మందికి ఆదివారం సాయంత్రం పురానాపూల్ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ విషాద ఘటనలో మొత్తం 17 మందిలో 8 మంది చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారం సాయంత్రం, ఆశా భర్త రోహిత్ తాను తట్టుకోలేని దుఃఖంతో కన్నీటి పర్యంతమవుతూ, తమ ఇద్దరు పిల్లల అంత్యక్రియలు నిర్వహించారు. మొత్తం 15మందిలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను సమాధి చేయగా, మిగతా వారి దహన సంస్కారాలు అదే శ్మశానవాటికలో జరిగాయి. మిగిలిన ఇద్దరి అంత్యక్రియలు ఈఎస్‌ఐ, పంజాగుట్ట శ్మశానాల్లో జరిగాయి.

చిన్నారులను హత్తుకుని.. కన్నీటి దృశ్యం

ఘటన స్థలంలో మ‌ర్చిపోలేని హృద‌య‌విదార‌క దృశ్యం క‌నిపించింది. ఒక వృద్ధ మహిళ నాలుగురు చిన్నారులను హ‌త్తుకుని మంటల మధ్య మరణించిన స్థితిలో కనిపించారు. స్థానికులు మీర్ జాహిద్, మొహమ్మద్ అజ్మత్ మంట‌ల నుంచి వీరిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే వారు మృతి చెందారు. “ఆమె చేతిలో ఫోన్ టార్చ్ వెలుగుతో పట్టుకొని చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించినట్లు అనిపించింది” అని జాహిద్ చెప్పాడు.

ఈ ఘోర ఘటన గురించి మృతుల బంధువులు విచారం వ్యక్తం చేశారు. ప్రహ్లాద్ మోదీ బంధువు గోవింద్ మోదీ మాట్లాడుతూ.. “మా పూర్వీకులు శతాబ్దం కిందటే హైదరాబాద్‌కు వచ్చారు. చార్మినార్ వద్దే నివసిస్తున్నారు. వారాంతంలో చివరగా కుటుంబ సభ్యులు పెద్దలతో కలిసి గడిపేందుకు వచ్చారు. కానీ తెల్లారేస‌రికి వారంతా మనల్ని విడిచిపెట్టారు” అని కన్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.

గుల్జార్ హౌజ్ వద్ద ఉన్న ఓ నివాస భవనంలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కుటుంబ పెద్ద ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన ఎనిమిది మంది పిల్లలు కూడా ఉన్నారు. బాధితుల వయస్సు 2 నుండి 73 సంవత్సరాల మధ్యగా ఉంది.

గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదానికి కారణమేంటి? 

ఈ ప్రమాదం ఉదయం 6 గంటల సమయంలో జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇది సంభవించినట్లు అగ్నిమాపక శాఖ పేర్కొంది. భవనంలో ఉన్న మెయిన్ ఎలక్ట్రికల్ ప్యానల్ నుండి మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఈ ప్యానల్ మోదీ కుటుంబానికి చెందిన మూడు నగల దుకాణాలకు సంబంధించినది. వాటిలో ఒక దుకాణం 1906లో స్థాపించార‌ని సమాచారం.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ.. “షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన స్పార్క్స్ వుడ్ ప్యానల్ మీదుగా వ్యాపించి, ఓ ఏసీ కంఫ్రెసర్ యూనిట్‌లో పేలుడు జ‌రిగింది. మిగతా వాటికి వ్యాపించి.. ఇది పెద్ద మంటగా మారింది” అన్నారు. ఒకే ప్రవేశద్వారం, ఇరుకైన‌ మెట్ల మార్గం ఉండటంతో బయటకు రాలేక‌పోయార‌ని" తెలిపారు.

ఈ ప్రమాదాన్ని ఆపేందుకు 11 ఫైర్ ఇంజిన్లు, ఫైర్ ఫైటింగ్ రోబో, 17 అధికారులు, 70 సిబ్బంది ఘటనా స్థలానికి చేరారు. ఉదయం 6:16కి కాల్ అందిన వెంటనే స్పందించామని నాగిరెడ్డి స్పష్టం చేశారు. అయితే, మృతుల బంధువులు అధికారులు ఆలస్యంగా స్పందించార‌నీ, ఈ కార‌ణంగా కూడా మ‌రిన్ని ప్రాణాలు కోల్పోయారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !