
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్.. డ్రగ్స్ హబ్... మెడికల్ హబ్ గా మారిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. కేవలం ఇక్కడి నుండే 9 బిలియన్ కరోనా వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అవుతున్నాయని... అలాగే 65 శాతం ఫార్మా ఉత్పత్తులు కూడా ఇక్కడినుండే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. మెడికల్ టూరిజం హైదారాబాద్ లో బాగా అభివృద్ధి చెందుతోందని... పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మనదగ్గరికి వచ్చి చికిత్స తీసుకునేలా ఎదిగామని హరీష్ అన్నారు.
హైదరాబాద్ మలక్ పేటలోని యశోదా హాస్పిటల్లో కొత్తగా ఏర్పాటుచేసిన పెట్ స్కాన్ మంత్రి హరీశ్ రావు ప్రారంబించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ సమర్థవంతమైననాయకత్వం, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటం, శాంతి భద్రతలు పకడ్బందీగా నిర్వహించడం, విప్లవాత్మకమైన విధానాల వలనే హైదరాబాద్ కు పెట్టుబడులు తరలి వచ్చేలా చేస్తున్నాయన్నారు. ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థలు ఇక్కడ నెలకొనడం వల్ల ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుండి ఎంతో మంది పేషెంట్లు నాణ్యమైన, అధునాతన చికిత్స కోసం ఇక్కడికి వస్తున్నారని...తిరిగి వారి దేశాలకు ఆరోగ్యంగా వెళ్తున్నారని హరీష్ పేర్కొన్నారు.
''మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద మొత్తంలో పేషెంట్లు ఇక్కడకు వస్తుంటారు. కరోనా సమయంలో హైదరాబాద్ దేశానికి సేవలు అందించింది. ఇక్కడి నాణ్యమైన సేవలు పొందేందుకు క్యూ కట్టారు. ఇది మనకు గర్వకారణం'' అన్నారు.
''సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. 2014 లో 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 33 చేసుకుంటున్నాం. ఎంబీబీఎస్ సీట్లు 700 నుండి 5240 కు ప్రభుత్వ రంగంలో చేరబోతున్నాయి. ప్రతి జిల్లాలో వందమంది విద్యార్థులతో నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రారంభిస్తున్నాము'' అని వైద్య మంత్రి తెలిపారు.
''తెలంగాణ రాజధాని హైద్రాబాద్ లో మరో 6000 పడకలు అందుబాటులోకి రాబోతున్నాయి. వరంగల్ లో హెల్త్ సిటీ 2000 పడకలతో అందుబాటులోకి రాబోతున్నది. తెలంగాణ వచ్చిన నాడు ప్రభుత్వంలో ఉన్నవి 200 ఐసీయు బెడ్స్... ఇప్పుడు 6000 కు పెంచుకున్నాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా మంచి వైద్యులు ఉన్నారు. మేము కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడి పని చేస్తున్నాం. అద్భుతమైన వైద్య సేవలను మా వైద్యులు అందిస్తున్నారు. మావాళ్ళు చాలా కష్ట పడుతున్నారు'' అన్నారు.
''సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ బ్లాక్ ఏర్పాటు చేస్తున్నాం. ఉచితంగా మరిన్ని సేవలు అందించాలని నిర్ణయించాం. ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఏర్పాట్లు చేస్తున్నాం'' అని వైద్యారోగ్య మంత్రి హరీష్ పేర్కొన్నారు.