గంజాయి స్మగ్లింగ్ వాహనానికి భారత ప్రభుత్వ స్టిక్కర్... ఓఆర్ఆర్ యాక్సిడెంట్ లో వెలుగులోకి సంచలనాలు

Arun Kumar P   | Asianet News
Published : Jun 14, 2022, 05:18 PM ISTUpdated : Jun 14, 2022, 05:24 PM IST
గంజాయి స్మగ్లింగ్ వాహనానికి భారత ప్రభుత్వ స్టిక్కర్... ఓఆర్ఆర్ యాక్సిడెంట్ లో వెలుగులోకి సంచలనాలు

సారాంశం

నిన్న సాయంత్రం హైదరాబాద్ శివారులోని ఓఆర్ఆర్ పై భారత ప్రభుత్వ స్టిక్కర్ తో కూడిన వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదం భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేసింది. 

హైదరాబాద్: పోలీసులకు చిక్కకుండా వుండేందుకు స్మగ్లింగ్ గ్యాంగ్స్ రోజుకో కొత్తమార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు గంజాయి అక్రమరవాణా ముఠాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నా స్మగ్లర్లు ఏమాత్రం తగ్గడంలేదు. పోలీసుల కళ్లుగప్పేందుకు కొత్త కొత్త పద్దతుల్లో స్మగ్లింగ్ చేపడుతున్నారు. ఇలా హైదరాబాద్ శివారులో జరిగిన రోడ్డుప్రమాదం ఓ గంజాయి ముఠా అతితెలివితో చేస్తున్న స్మగ్లింగ్ ను పట్టించింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకులు శివం దూబే (25), దుర్గేష్ దూబే (37), సోనీ పాండే (28) గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా సరిహద్దుల్లో గంజాయిని సాగుచేసే వారినుండి కొనుగోలు చేసి పలు రాష్ట్రాలు దాటుకుని గుట్టుగా యూపీ వరకు చేర్చి అమ్ముతుంటారు. పోలీసులకు అనుమానం రాకుండా స్మగ్లింగ్ కోసం వాడే వాహనాలకు అధికారులు వాడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టిక్కర్ వాడుతున్నారు. దీంతో వీరి వాహనాన్ని ఏ రాష్ట్ర పోలీసులు ఆపకపోవడంతో యధేచ్చగా గంజాయిని తరలిస్తున్నారు. 

ఇలా ఇటీవల ఏపీ, ఒడిషా ఏజన్సీ ప్రాంతాల్లో దాదాపు 300 కిలోల గంజాయిని కొనుగోలు చేసింది ఈ యూపీ ముఠా. దీన్ని పదికిలోల చొప్పున 30 ప్యాకెట్లుగా మార్చి ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల మీదుగా యూపీకి తరలించేందుకు కారులో బయలుదేరారు. అయితే గంజాయిని తరలిస్తున్న కారు హైదరాబాద్ శివారులోని  మేడ్చల్‌ జిల్లా కీసర వద్ద ఓఆర్‌ఆర్‌పై సోమవారం ప్రమాదానికి గురయ్యింది. దీంతో గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టు  రట్టయ్యింది. 

ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలై పట్టుబడగా మరో ఇద్దరు పారిపోయారు.  తీవ్రంగా గాయపడిన శివందూబె, దుర్గేష్‌ దూబె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని నగరంలోకి ఓ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. పారిపోయిన మిగతా ఇద్దరు స్మగ్లర్ల గురించి పోలీసులు గాలిస్తున్నారు. 

ప్రభుత్వ స్టిక్కర్ ను వాహనానికి అతికించుకుని గంజాయి స్మగ్లింగ్ చేయడంపై పోలీసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గంజాయి స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తుండటంతో స్మగ్లర్లు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని.. అయినా వారి ఆగడాలు సాగనివ్వడం లేదని పోలీసులు తెలిపారు. వాహనంలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఇదిలావుంటే హైదరాబాద్‌లోని ఆసిఫ్నగర్లో గత అర్థరాత్రి కొందరు యువకులు గంజాయి మత్తులో హల్‌చల్ చేశారు. జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. స్థానికులు, వాహనదారులనే కాదు చివరకు పోలీసులతోనూ అనుచితంగా ప్రవర్తించారు. 

గంజాయి బ్యాచ్ అలజడిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. యవకులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. అయితే గంజాయి మత్తులో ఉన్న యువకులు పోలీసు వాహనం ఎక్కి నానా రచ్చ చేశారు. పోలీసు వాహనంతో పాటు అక్కడ ఉన్న పలు వాహనాల అద్దాలను పగలగొట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొనేందుక కఠినంగా వ్యవహరించారు. యువకులపై లాఠీ‌లతో దాడి చేసి.. అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. అలాగే వారికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.  
  
 

 

  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?