
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్థి, యువజన సంఘాలు యత్నించాయి. పోలీసు నియామకాల్లో అవతవకలను నివారించాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు.. విద్యార్థి, యువజన సంఘాల నేతలను అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విద్యార్థి, యువజన సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇక, 1600/800 మీటర్లు రన్నింగ్ పాసైన అభ్యర్థులందరికి మెయిన్స్ ఎగ్జామ్‌కు అవకాశం కల్పించాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 7 మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో తప్పు ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఈ నెల 5వ తేదీన ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.