హైద్రాబాద్ నగరంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెండు కిలోల బంగారాన్ని ఇవాళ కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారంనాడు రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎనిమిది కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గతంలో కూడ పలు దఫాలు బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.
నిన్న హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 4.86 కోట్ల విలువైన ఎనిమిది కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి రెండు కిలోల బంగారు కడ్డీలను సీజ్ చేశారు. ప్యాంటులో దాచి బంగారు కడ్డీలను తీసుకువస్తున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు.ఇదే విమానంలో వచ్చిన ప్రయాణీకుడి నుండి 1.78 కిలోల బంగారం సీజ్ చేశారు.మరో ప్రయాణీకుడి నుండి 2.17 కిలో బంగారాన్ని సీజ్ చేశారు. ఈ ప్రయాణీకుడు షార్జా నుండి హైద్రాబాద్ వచ్చారు. లో దుస్తుల్లో బంగారాన్ని పేస్టుగా మార్చి తీసుకువస్తున్న ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని నుండి 2.05 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. ఈ నలుగురిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇవాళ కూడ హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెండు కిలోల బంగారాన్ని తీసుకువస్తున్న ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అధికారుల కళ్లుగప్పి ఎయిర్ పోర్టు నుండి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఇవాళ అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు పట్టుకున్న ప్రయాణీకుడు జెడ్డా నుండి వచ్చినట్టుగా గుర్తించారు.
క్యాప్సూల్స్ , పేస్ట్ రూపంలో అక్రమార్కులు బంగారాన్ని తరలిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 14న 13.63 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. గత ఏడాది అక్టోబర్ 6న ఏడు కిలోల బంగారం సీజ్ చేశారు అధికారులు. ఈ ఏడాది జూలై 10న 1.93 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ రూ.1.27 కోట్లుందని అధికారులు అంచనా వేశారు.