కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లురవికి సికింద్రాబాద్ పోలీసులు శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసుకు సంబంధించి పోలీసులు నోటీసులిచ్చారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవికి సికింద్రాబాద్ పోలీసులు శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఫోటో మార్పింగ్ చేశారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మల్లు రవికి నోటీసులు అందించారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ఈ ఏడాది జనవరి 18వ తేదీన మల్లు రవి సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరైన విషయం తెలిసిందే .
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ఈ ఏడాది జనవరి 9వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనవరి 12న విచారణకు రావాలని కోరారు. అయితే సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో జనవరి 12న కాకుండా మరో రోజున విచారణకు వస్తానని మల్లు రవి సీసీఎస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో జనవరి 19న సీసీఎస్ పోలీసులు మల్లు రవిని సుమారు మూడు గంటల పాటు విచారించారు.
also read:కాంగ్రెస్ వార్ రూమ్ కేసు: మల్లు రవిని విచారించిన సీసీఎస్ పోలీసులు
2022 డిసెంబర్ 13వ తేదీన హైద్రాబాద్ మాదాపూర్ లో కాంగ్రెస్ వార్ రూమ్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సోషల్ మీడియాలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు అనుచిత పోస్టులకు సంబంధించి అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు సోదాలు చేశారు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ సభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై విచారణకు హాజరైన సునీల్ కనుగోలు కాంగ్రెస్ వార్ రూమ్ కు తనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు. కాంగ్రెస్ వార్ రూమ్ కు తాను ఇంచార్జీనని కాంగ్రెస్ నేత మల్లు రవి సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా సీసీఎస్ పోలీసులు గత నెల 18న మల్లు రవిని విచారణకు పిలిచారు.తాజాగా మల్లు రవికి సికింద్రాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.