స్విమ్మింగ్ పూల్‌లో ప‌డి బాలుడు మృతి: న్యాయం చేయాలని బంధువుల నిరసన.. పోలీసులతో వాగ్వాదం

By Sumanth KanukulaFirst Published May 16, 2022, 11:37 AM IST
Highlights

హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని నాగోల్‌ సమతాపురికాలనీలోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌లో 10 ఏళ్ల బాలుడు మనోజ్ కుమార్ మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు యజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. 
 

హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని నాగోల్‌ సమతాపురికాలనీలోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌లో 10 ఏళ్ల బాలుడు మనోజ్ కుమార్ మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని బాలుడు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆందోళన చేపట్టారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే చిన్నారి కుటుంబ సభ్యులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమకు న్యాయం కావాలని కోరుతున్నారు. న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని చెబుతున్నారు. 

అయితే పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. స్విమ్మింగ్ పూల్ యజమానిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిపారు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణకు అనుమతి లేదనే విషయాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్టుగా తెలితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే బాలుడి కుటుంబ సభ్యులు కోరుతున్న పరిహారం విషయం తమ పరిధిలోని అంశం కాదని పోలీసులు తెలిపారు. అందులో పోలీసులు జోక్యం చేసుకోవడం కుదరదని చెప్పారు. 

అసలేం జరిగింది..
హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని నాగోల్‌ సమతాపురికాలనీలోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌లో శనివారం 10 ఏళ్ల బాలుడు మనోజ్ కుమార్ మృతిచెందాడు. చైతన్యపురి పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. ‘‘మనోజ్ కుమార్ నాగోల్ ప్రాంతంలోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించాం. కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఘటనా స్థలంలో ఉన్న కొద్దిమందితో మాట్లాడాం. బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ యజమాని అశోక్ గౌడ్ పై కేసు నమోదు చేశాం. ఎవరైనా ఇందులో ప్రమేయం ఉంటే వారిపై కూడా కేసు నమోదు చేస్తాం’’ అని తెలిపారు.

మృతుడి అత్త మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మనోజ్ కుమార్ లింగంపల్లిలో ఉంటున్నాడు. అతను వేసవి సెలవుల కోసం మా వద్దకు వచ్చాడు. ఈరోజు అతను ఈత ప్రాక్టీస్ చేయడానికి బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లాడు. సేఫ్టీ ట్యూబ్‌లు లేవని నిర్వాహకులు చెప్పడంతో.. ట్యూబ్‌లు(సేఫ్ గార్డ్‌లు) ధరించకుండానే అతను కొలనులోకి ప్రవేశించి నీటిలో మునిగి చనిపోయాడు. మనోజ్ నీటిలో మునిగిపోతున్న సమయంలో ఎవరూ లేరు. పూల్‌లోనే మనోజ్‌ని చూడగానే అరవడం మొదలుపెట్టాం. 10 నిమిషాల తర్వాత నిర్వాహకులు వచ్చారు’’ అని తెలిపారు. 

click me!