Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. కాచిగూడ-యశ్వంత్ పూర్ వందేభారత్ రైలును ఈ నెల 24న ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. మరుసటి రోజు నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
Hyderabad-Bengaluru Vande Bharat Express: హైదరాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. కాచిగూడ-యశ్వంత్ పూర్ వందేభారత్ రైలును ఈ నెల 24న ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. మరుసటి రోజు నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్ , బెంగళూరు నగరాలను సెప్టెంబర్ 25 నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనుసంధానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ స్టేషన్‌లో జరిగే కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ. కిషన్‌రెడ్డి , ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు టెక్ హబ్‌ల మధ్య 609 కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.
రైలు నం. 20703 కాచిగూడ - యశ్వంత్‌పూర్ కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుని మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్‌లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 20704 యశ్వంత్‌పూర్ - కాచిగూడ , యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి రాత్రి 11:15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. సెప్టెంబర్ 24న తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశం ఉంది. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్ కూడా ఉన్నాయి. ఈ రైలు గురువారం మినహా వారంలో అన్ని రోజులు నడపబడుతుంది. విజయవాడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలలో ఆగుతూ మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
రైల్వే అధికారుల ప్రకారం, కొత్త వందే భారత్ రైళ్లు మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాల కోసం అనేక కొత్త ఫీచర్లతో చేర్చబడ్డాయి. ప్రస్తుతం, భారతీయ రైల్వేలో 25 జతల వందే భారత్ రైళ్లు నడపబడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో 120 శాతం ఆదరణతో రెండు వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్నాయి.