అష్టదిగ్భందంలో హుజురాబాద్... భారీగా మొహరించిన పోలీసులు, ముమ్మరంగా తనిఖీలు (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 5, 2021, 9:40 AM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నిక నేపధ్యంలో ఇప్పటికే ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో భారీగా పోలీసులు మొహరించారు. ప్రైవేట్ వాహనాల్లో, ఆర్టిసి బస్సుల్లో తనిఖీలు చేపట్టారు.

కరీంనగర్: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక (Huzurabad Bypoll) హాట్ టాపిక్. ఈ ఎన్నికను బిజెపి (bjp), టీఆర్ఎస్ (trs) పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉపఎన్నికలో ప్రజలను ప్రలోభాలకు గురిచేయడానికి భారీగా డబ్బులు పంచడానికి సిద్దమైనట్లు ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో వుండటంతో ఎలాంటి అక్రమాలు జరక్కుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 

ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామునుండి హుజురాబాద్ పట్టణంలో పోలీసులను భారీగా మోహరించారు. పట్టణంలోని జమ్మికుంట రోడ్డు, కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ వాహనాలు, అర్టిసి బస్సులను ఆపి తనిఖీ చేపట్టారు పోలీసులు. భారీగా డబ్బులను తీసుకువెళ్లే వారు అందుకు సంబంధించిన పత్రాలను వెంటపెట్టుకోవాలని సూచించారు. పోలీసుల తనిఖీలకు ప్రజలు సహకరించాలని పోలీసులు సూచించారు. 

వీడియో

లా అండ్ ఆర్డర్ డిసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాల సహాయంతో హుజురాబాద్ పట్టణమంత  జల్లెడ పట్టారు. ఈ క్రమంలో పలువురు అనుమానితులను అదుపులో తీసుకొని ప్రశ్నించారు.

read more  హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఈటల భార్య జమున ఆస్తులు మూడేళ్లలో మూడింతలు

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి గత శుక్రవారం(అక్టోబర్ 1వ తేదీన) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఇదేరోజు నుండి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విద్యార్థిసంఘం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ (వెంకట నర్సింగరావు) బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.

click me!