
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికల సందర్భంగా నిరుద్యోగ సమస్య గురించి లేవనెత్తిన తనపై అధికార టీఆర్ఎస్ శ్రేణులు చాలా దురుసుగా ప్రవర్తించారని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో గందరగోళం సృష్టించానంటూ తనను పోలీసులు చితకబాదారని యువతి ఆరోపించింది. కంటతడి పెడుతూ తన ఆవేదననంతా వెల్లగక్కుతూ సోషల్ మీడియాతో వీడియో పోస్ట్ చేసింది బాధిత యువతి.
యువతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. huzurabad bypoll లో TRS పార్టీ ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వివిధ వర్గాలకు అండగా వుంటామని హామీ ఇస్తున్న అధికార పార్టీ నిరుద్యోగ సమస్యలపై మాత్రం స్పందించడంలేదని ఆ యువతి భావించినట్లుంది. దీంతో ఈ విషయంపై అధికార పార్టీని ప్రశ్నించాలని నిర్ణయించుకున్నట్లు నరసింహులపల్లి గ్రామానికి చెందిన నిరుద్యోగ యువతి లకోట నిరోష భావించింది.
ఈ క్రమంలోనే వీణవంక మండల కేంద్రంలో గత ఆదివారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిరోష తెలంగాణలోని నిరుద్యోగ యువత ఆవేదన గురించి మాట్లాడుతూ... ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడేస్తారని ప్రశ్నించింది. దీంతో కోపంతో ఊగిపోయిన టీఆర్ఎస్ శ్రేణులు...bjp వాళ్లు తమ కార్యక్రమంలో గందరగోళం సృష్టించమని పంపించారా అంటూ తనను అక్కడినుండి తోసేసారని సదరు యువతి ఆరోపించింది. అంతేకాదు బిజెపి వాళ్ళ దగ్గర రూ.10లక్షలు తీసుకున్నానని ఆరోపించారని బాధిత యువతి తెలిపింది.
read more కేసీఆర్‌కి ఈసీ షాక్: హుజూరాబాద్‌లో దళితబంధుకి బ్రేక్
ఈ ఘటనతో తనకు చాలా కోపం వచ్చినా గొడవ ఎందుకని అక్కడినుండి వస్తుంటే పోలీసులు పట్టుకుని చితకబాదారని నిరోష తెలిపింది. రోడ్డుపైనే ఇస్టం వచ్చినట్లు కొట్టారని... ఈ క్రమంలోనే తన మెడలోని గోల్డ్ చెయిన్ పోయిందని తెలిపింది. చేతులు, కాళ్లు పట్టుకుని బలవంతంగా పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారని... అక్కడ కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని బాధిత యువతి ఆరోపించింది. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు తొత్తులుగా మారి ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కంటతడి పెడుతూ తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది బాధిత యువతి నిరోష.
ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకోగా సోమవారమే నిరోష ఆవేదనను సెల్ఫీ వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టింది. ఈ వీడియో కాస్త వైరల్ గా మారి నిరుద్యోగ యువతను చేరడంతో వారు టీఆర్ఎస్ పార్టీ, పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. మహిళ అని కూడా చూడకుండా ఆమెను కొడతారా అంటూ మండిపడుతున్నారు.