Huzurabad Bypoll: దూకుడు పెంచిన ఈటల... బిజెపిలోకి భారీగా చేరికలు

By Arun Kumar PFirst Published Sep 29, 2021, 2:03 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికకు షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో బిజెపి నాయకులు ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై విమర్శల ఘాటు పెంచారు. 

హుజురాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలవడంతో బిజెపి నాయకులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరింత దూకుడు పెంచారు. ఇప్పటివరకు తనవెంట వుండేవారు టీఆర్ఎస్ గాలానికి చిక్కకుండా కాపాడుకున్న ఆయన ఇప్పుడు బిజెపిలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ పరిధిలోని వావిలాల, ఇళ్లంద కుంట, ధర్మారం, మాదన్నపేటకు చెందిన పలువురు నాయకులు, ప్రజలు ఈటల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుని బిజెపిలో చేరారు. 

ఆ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... హుజూరాబాద్ ప్రశాంతతను కోల్పోయి 4 నెలలు అయ్యిందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నారని... తనతో ఉన్న నాయకులు అందరినీ కొన్నారన్నారు. ఇప్పుడేమో ఊరూరుకు దావత్ లు చేస్తున్నారని మండిపడ్డారు. 

''ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఎన్ని డబ్బులు ఇచ్చినా, దావత్ లు ఇచ్చినా, దళిత బంధు ఇచ్చినా ఇవన్నీ ఈటల వల్లే వచ్చాయని ప్రజలే కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. మా బిడ్డకే ఓటు వేస్తామని చెప్తున్నారు. దీంతో ఏం చెయ్యాలో అర్థం కాక టీఆర్ఎస్ వాళ్లు చిల్లర పనులు చేస్తున్నారు. గడియారాలు తొక్కి పగలగొట్టిస్తున్నరు. డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు'' అని ఈటల అన్నారు. 

Huzurabad Bypoll:ఈటలకు చేధుఅనుభవం... బూతులుతిడుతూ దుమ్మెత్తిపోసిన దంపతులు  

''ఇక నిన్నటి నుండి తనను బద్నాం చేయడానికి కొత్త అవతారం ఎత్తారు. ఓ ఊరికి పోతే అక్కడ ఓ కుటుంబంతో తిట్టించారు. తనను తిట్టిన కుంటుంబమే గతంలో నా వద్దకు వచ్చి అడిగితే కుటుంబపెద్దకు సబ్ స్టేషన్లో ఉద్యోగం ఇప్పించా. ఆ తర్వాత కొడుక్కు ఉద్యోగం పెట్టించమంటే హుజూరాబాద్ హాస్పిటల్ లో ఉద్యోగం పెట్టించా. అయితే అతడు డాక్టర్ తో కలిసి ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషంట్ ను అక్కడికి పంపించడం మొదలు పెట్టాడు. ఇంకో చిల్లర పని కూడా చేస్తే ఆయన్ను సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు'' అని ఈటల వివరించారు. 

వీడియో

''సస్పెండయిన 6 నెలలకు అతను గుండెపోటుతో చనిపోతే హాస్పిటల్ సూపరింటెండెంట్ వల్లనే చనిపోయారు అని ధర్నా చేశారు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చనిపోయిన అతని భార్యకు కూడా నేనే ఉద్యోగం ఇప్పించా. కానీ నిన్న ఆ ఊరికి నేను పోతే ఆ కుటుంబాన్ని రెచ్చగొట్టి తిట్టించారు. సీఎం కేసిఆర్ కు డబ్బులు ఖర్చు పెట్టడం, సారా పంచడం మాత్రమే కాదు బట్టకాల్చి మీద వేసి అభాసుపాలు చేయడమూ తెలుసు. అందులో భాగంగానే ఇలాంటి చిల్లర పనులు కూడా చేయిస్తారు'' అని మండిపడ్డారు. 

''హుజురాబాద్ లో 75-80 శాతం ప్రజలు నాకు మద్దతుగా ఉన్నారు. ఏం చేసిన కూడా గెలవలేమని తెలిసే ఇలాంటి పనులు చేస్తున్నారు. హుజూరాబాద్ లో నన్ను బొండపెట్టి, అసెంబ్లీ లో నా మొఖం కనిపించకుండా చేస్తారట. అది కానిస్తరా?'' అని ఈటల ఓటర్లను ప్రశ్నించారు. 

''దళిత బంధు వద్దు అని నేను రాసినట్టు దొంగ లెటర్ పుట్టించారు. ఆ దొంగ లెటర్ మీద మళ్లీ ధర్నాలు చేయిస్తున్నారు. నేనే కదా డిమాండ్ చేసింది ఎన్నికల కంటే ముందు దళిత బంధు అన్నీ కుటుంబాలకు ఇవ్వాలని. నా వల్ల రూ.10 లక్షలు రావడం వారికి నేను రుణం తీర్చుకున్నట్టు అయ్యింది అని చెప్పింది నేనే. అంతే కాదు ఇతర కులాల్లో ఉన్నవారికి కూడా  రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే. కానీ నేను రాసినట్టు ఒక అబద్ధపు లెటర్  పుట్టించి చిల్లర పనులు చేస్తున్నారు'' అని అన్నారు. 

''ఇలాంటి చిల్లర ప్రచారాలు చేసి అభాసు పాలు చేస్తారు... అప్రమత్తంగా ఉండండి. కేసిఆర్ దగ్గర బానిసలా ఉంటేనే మంచి వాడు. లేకుంటే కంట్లో పెట్టుకుంటారు. మన ఓటు మనం వేసుకుందాం... కేసిఆర్ అహంకారాన్ని అణచివేద్దాం'' అని ఈటల రాజేందర్ అన్నారు. 

click me!