
కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా ఈటల రాజేందర్ ను ఆదరించిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఈటలను మంత్రి స్థాయికి తీసుకువచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరే. రాజకీయ అక్షరాలు నేర్పి ఈ స్థాయికి తీసుకువచ్చిన కేసీఆర్ నే ఇప్పుడు ఈటల గోరి కడతా అంటున్నాడని... ఆయన వాడుతున్న భాషను ఈ సమాజం హర్షించదని హరీష్ అన్నారు.
హుజురాబాద్ నియోజకర్గ పరిధిలోని జమ్మికుంట స్వాతి గార్డెన్ లో జరిగిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... ఎన్నికల కోసమే హుజురాబాద్ లో దళిత బంధు అమలుచేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారని అన్నారు. కానీ గతంలో ఎలాంటి ఎన్నికలు లేకపోయినా ఇదే హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతు బంధును సీఎం కేసీఆర్ ప్రారంభించారని హరీష్ గుర్తుచేశారు.
''ఎక్కడెక్కడి నుండో మన భాషరాని వాళ్ళను తీసుకొచ్చి బిజెపి ప్రచారం చేస్తే తప్పు లేదు... కానీ నేను హుజురాబాద్ కు వస్తే తప్పా. ఈటల మాట్లాడే భాష ఈ ప్రాంత ప్రజలకు నష్టం చేకూర్చేలా ఉంది. తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈటల" అని ఆర్థిక మంత్రి అన్నారు.
READ MORE Huzurabad Bypoll: బిడ్డా కేసీఆర్... నువ్వు మాడి మసైపోతావు జాగ్రత్త: ఈటల ఘాటు వ్యాఖ్యలు
''ఈటల రాజేందర్ మంత్రిగా వుండగానే అభివృద్ధి చేయలేదు... ఇక ప్రతిపక్షంలో ఉంటే ఏం అభివృద్ధి చేస్తాడు. కాబట్టి హుజురాబాద్ ప్రజలు ఎవరిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి ఓటేయాలి'' అని సూచించారు.
''సిద్దిపేటలో పేద ఆర్యవైశ్యులకు డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు శుభకార్యాలు చేసుకోడానికి వీలుగా ఓ ఫంక్షన్ హాల్ కూడా కట్టించా. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఓసిల్లో ఉన్న పేదలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు రాజకీయంగా కూడా అవకాశం కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం'' అని తెలిపారు.
''కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ ద్వారా ఎంత మంది వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఎవరితో సాధ్యం అయితదో అలోచించండి. రానున్న రోజుల్లో వైశ్యుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నా. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించండి'' అని మంత్రి హరీష్ కోరారు.