Huzurabad bypoll: రేవంత్ రెడ్డిని ఈటల రహస్యంగా కలిశారని కేటీఆర్ వ్యాఖ్య

By telugu teamFirst Published Oct 23, 2021, 11:43 AM IST
Highlights

బిజెపి, కాంగ్రెసులపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెసు ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెసు కుమ్మక్కయ్యాయని, ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ Huzurabad bypollలో పోటీ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఈటల రాజేందర్ రహస్యంగా కలిశారని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. 

నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికల్లో బిజెపి డమ్మీ అభ్యర్థిని దింపి కాంగ్రెసుకు సహకరించిందని KTR ఆరోపించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ లోకసభ సీట్లలో కూడా గతంలో కాంగ్రెసు ఓట్లు బిజెపికి బదిలీ అయ్యే విధంగా అవగాహనకు వచ్చాయని ఆయన చెప్పారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగా బిజెపి, కాంగ్రెసు కలిశాయని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ డబ్బులకు అమ్ముడుపోయారని ఆయన అన్నారు. గాంధీ భవన్ లో గాడ్సేలు దూరారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకు కాంగ్రెసులో అగ్రతాంబూలం ఇస్తున్నారని అమరీందర్ సింగ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

Also Read: కిషన్ రెడ్డిపై దాడి... రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు... బండి సంజయ్ పిలుపు

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని Revanth Reddyకి మాణిక ఠాగూర్ రూ.500 కోట్లకు అమ్ముకున్నారని, ఆ ఆరోపణ తాను చేయడం లేదని,  కాంగ్రెసు సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణ చేశారని, ఆ ఆరోపణను మాణికం ఠాగూర్ ఇప్పటి వరకు ఖండించలేదని ఆయన అన్నారు. తన పార్టీవాళ్లు చేస్తున్న ఆరోపణలపై మాణికం ఠాగూర్ మాట్లాడితే బాగుంటుందని ఆయన అన్నారు.  

బిజెపి, కాంగ్రెసు మధ్య లోపాయికారి ఒప్పందం లేకపోతే ఈటల రాజేందర్ కు ఓటేయాలని కాంగ్రెసు నాయకుడు కొండా విశ్వేశ్వర రెడ్డి ఎలా పిలుపునిస్తారని ఆయన అడిగారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నా కూడా విజ్ఞులైన ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

Also Read: Huzurabad Bypoll: నన్ను సాదుకుంటారో లేక సంపుకుంటారో మీ ఇష్టం..: ఈటల భావోద్వేగం

ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్దమైన పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రారంభమైన దళిత బంధు పథకం అమలును ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. ఇ్పపుడు పక్క జిల్లాలకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలవుతుందంటున్న ఈసీ పక్క రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. 

హైదరాబాదులోని హైటెక్స్ లో తమ టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్లీనరీ ఏర్పాట్లపై, ఎజెండాపై కూడా ఆయన మాట్లాడారు. 

Also Read: Huzurabad Bypoll: టీఆర్ఎస్ వాళ్లిచ్చే పైసలు తీసుకోండి.. బీజేపీకి ఓటేయండి: బండి సంజయ్
 

click me!