హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ మంత్రి కొండా సురేఖ కాంగ్రెసు నాయకత్వానికి షరతు పెట్టారు. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారిన విషయం తెలిసిందే.
వరంగల్: హుజూరాబాద్ శానససభ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ మంత్రి కొండా సురేఖ తెలంగాణ కాంగ్రెసు నాయకత్వానికి ఓ షరతు పెడుతున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెసు టికెట్ తన కుటుంబానికి కేటాయిస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే తాను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె చెప్పారు.
వరంగల్ లక్ష్మీపురంలో గురువారం నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు రంగు తెలుసుకుని తాను టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్లు ఆమె తెలిపారు. టీఆర్ఎస్ లో తనను పావులా వాడుకున్నారని ఆమె విమర్శించారు.
వరంగల్ దళితులకు దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కొండా సురేఖ భర్త కొండా మురళీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశఆరు. లేకపోతే వరంగల్ నుంచి దళితులను లారీల్లో తరలించి హుజారాబాద్ శాసనసభ ఉప ఎన్నికలో నామినేషన్లు వేయిస్తామని ఆయన హెచ్చరించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కొండా సురేఖను పోటీకి దించాలని కాంగ్రెసు నాయకత్వం భావిస్తోంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస యాదవ్, బిజెపి నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ బర్తరఫ్ చేశారు. దీంతో ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
బిజెపిలో చేరిన ఈటల రాజేందర్ ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణ మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే, హుజూరాబాద్ ఉప ఎన్నిక తేదీ ఇంకా ఖరారు కాలేదు.