
కరీంనగర్: ఎక్కడయినా సంత్సరానికి ఒక్కసారే దసరా పండుగ వస్తుంది... కానీ హుజూరాబాద్ లో మూడు నెలల నుండి దసరా నడుస్తోందని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ అన్నారు. ఈటల రాజేందర్ ఉద్యమ కారుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగానే కాదు చివరికి రాజీనామాతో కూడా హుజురాబాద్ ప్రజలకు మేలు చేశాడు అని అన్నారు. ఈటల ఏం చేయకపోతే అరుసార్లు ఇక్కడి ప్రజలు ఎలా గెలిపిస్తారా? అని ప్రశ్నించారు.
హుజురాబాద్ పట్టణంలోని మదువాని గార్డెన్ లో జరిగిన కుమ్మర శంఖారావానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చి అబద్ధాలు చెప్పే నాయకుల భరతం పడతామని హెచ్చరించారు. గట్ల రాయి తియలేనోడు ఏట్ల రాయి తిస్తాడట అంటూ టీఆర్ఎస్ నాయకులను ఈటల ఎద్దేవా చేశారు.
''ప్రస్తుతం హుజూరాబాద్ లో ప్రభుత్వ అధికారులు టీఆర్ఎస్ నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారు. హుజూరాబాద్ కు సంక్షేమ పథకాలు ప్రేమతో కాదు కేవలం ఓట్ల కోసమే వస్తున్నాయి. మూడు సంవత్సరాల నుండి పావలా వడ్డీ రాలేదు కానీ ఇప్పుడు ఇస్తున్నారు'' అని తెలిపారు.
''తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు... కానీ ఇంటికి ఒకరు చదువుకున్న వాళ్ళు ఉన్న ఉద్యోగాలు రావడం లేదు. నా రాజీనామా తర్వాతే ప్రగతి భవన్ లో ఉండే కేసీఅర్ బయటికి వస్తున్నాడు. మొట్టమొదటి సారిగా దళితుల ను పిలిచి భోజనం పెట్టిండు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని... ఇప్పుడే కాస్త కదలిక వచ్చింది'' అన్నారు.
read more ఈటల సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్ సీటుకు ఎసరు పెట్టే ఆలోచన హరీష్ రావుదే
''మాట్లాడితే చాలు అన్నీ మేమే ఇస్తున్నాం అంటున్నారు... వాళ్లేమయినా ఇళ్లలోంచి ఇస్తున్నారా? మనం పన్నులు కట్టిన పైసలే మనకు ఇస్తున్నాడు. కానీ మనకేమో సీఎం కేసీఅర్ ఇస్తున్నాడు అని చెబుతున్నారు. అందరం అదే నిజం అనుకుంటున్నాం'' అన్నారు.
''నేను రైతు బంధు వద్దని చెప్పలేదు... కేవలం పేద, సన్నకారు రైతులకు మాత్రమే ఇవ్వాలని చెప్పా. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటుకు రూ.20 వేలు ఇస్తారట. అవి తీసుకోండి కానీ ధర్మం మాత్రం తప్పకండి. కేసీఅర్ డబ్బులను, లిక్కర్ ను, పోలీసులను నమ్ముకున్నాడు. ఒక్క బక్కపల్చని మనిషి మీదకు వందల మందిని పడుతున్నారు. సొంత పార్టీ నాయకులను వెల కట్టి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం 95శాతం నాయకులు కేసీఅర్ వైపు ఉంటే 80 శాతం మంది ప్రజలు తనవైపు ఉన్నారు'' అన్నారు.
''ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళ ఇంట్లో నుండి ఇస్తున్నారా? అని ప్రజలు అడుగుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఏకమై పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా. బాధ్యత మర్చిపోతే బానిసల లాగా బతకాల్సి వస్తుంది. హుజూరాబాద్ ఎన్నిక రేపటి భవిష్యత్తుకు మూలమలుపు'' అని ఈటల పేర్కొన్నారు.