వరంగల్ ముగ్గురి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. చనిపోవాలనుకొన్న షఫీ స్నేహితుల బ్రెయిన్ వాష్ తో అన్న చాంద్ బాషాను చంపాలని ప్లాన్ చేసుకొన్నాడు. అన్న, వదనితో పాటు ఆయన బంధువును కూడ చంపారు. మరో ఇద్దరు ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వరంగల్: చనిపోవాలనుకొని భావించిన షపీ ఆ తర్వాత మనసు మార్చుకొన్నాడు. తాను చావడం కంటే అన్నను చంపడమే ఉత్తమమని భావించాడు. అన్న, వదినతో పాటు మరో బంధువును దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన ఆరుగురిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. షఫీతో పాటు ఆయనకు సహకరించన మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తన సోదరుడు చాంద్‌భాషా,ఆయన భార్య సాబేరా బేగంతో పాటు వారి బంధువును షఫీ అతని గ్యాంగ్ ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున దారుణంగా హత్య చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలను నిందితుడు ఒప్పుకొన్నాడు. జల్సాలకు అలవాటుపడిన షఫీ అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చలేక ఆయన ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పాడు. అయితే చావడం సమస్య పరిష్కారం కాదని స్నేహితులకు అతనికి నచ్చజెప్పారు. సోదరుడిని హత్య చేస్తే ఆస్తి వివాదం సెటిల్ చేసుకోవచ్చని షఫీ భావించాడు. స్నేహితులు ఇచ్చిన సలహాతో చావాలనుకొనే ఆలోచనను అన్న చాంద్‌భాషాను చంపాలనుకోవడంపై పెట్టాడు.15 రోజుల క్రితమే షఫీ తన మనసును మార్చుకొన్నాడు.
బోయిన వెంకన్న, ఎండీ సాజీద్, రాగుల విజేందర్, ఎండీ మీరా అక్బర్, ఎండీ పాషాలు షఫీకి బ్రెయిన్ వాష్ చేసినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. ఈ హత్యకు 15 రోజుల క్రితమే ప్లాన్ వేశాడు. ఈ హత్య కోసం హైద్రాబాద్ నుండి ఐదు వేట కత్తులను కొనుగోలు చేశాడు. వరంగల్ లో బ్యాటరీ సహాయంతో పనిచేసే రంపాన్ని కొన్నాడు. ఈ వస్తువులను షపీ తన ఇంట్లోనే దాచాడు.
ఆగష్టు 31 వ తేదీన సాయంత్రం షఫీ ఇంట్లో వీరంతా కలుసుకొన్నారు. ఇంటిపైన కూర్చొని ఎవరెవరు ఏం చేయాలనే దానిపై ప్లాన్ వేసుకొన్నారు. అందరూ కూడ మద్యం తాగారు. బుధవారం నాడు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తమ వెంట ఒక జత బట్టలను తీసుకుని సాజిద్, ఎండీ.పాషాల ఆటోల్లో మిగతా ముగ్గురు బయలుదేరారు. షఫీ తన అన్న ఇంటికి మార్గం చూపించేందుకు బైక్‌పై ముందు వెళ్లగా అతని వెనుక ఆటోల్లో మిగతా వారు వచ్చారు.
చాంద్‌పాషా ఇంటి ముందు ఆటోలో ఆగిన ఆరుగురు ముందుగా ఎలక్ట్రిక్ రంపం శబ్దం పక్క ఇళ్ల వాళ్లకు వినిపించకుండా ఉండేందుకు ఆటోను స్టార్ట్‌చేసి ఎక్స్‌లేటర్ పెంచారు. వెంకన్న అనే వ్యక్తి రంపాన్ని తీసుకోగా, మిగతా వారు వేట కత్తులతోపాటు కారం ప్యాకెట్లను పట్టుకున్నారు.
also read:వరంగల్ జిల్లాలో ముగ్గురి హత్య: పోలీసుల అదుపులో షఫీ సహా ఆరుగురు
చాంద్ పాషా ఇంటి ప్రధాన ద్వారం తలుపును రంపంతో కట్ చేసి ఇంటి కరెంట్‌ను నిలిపివేశారు. ప్రధాన ద్వారాన్ని మిషన్ కట్ చేసే క్రమంలో వచ్చిన శబ్దానికి చాంద్‌పాషా నిద్రనుంచి లేచి గట్టిగా అరిచాడు. ఆ తరువాత అతని భార్య సాబీరా బేగం, బావమరిది ఖలీల్‌పాషా, కుమారులు ఫహద్‌పాషా, సమద్‌పాషాలు నిద్రనుంచి లేచి ముందుకు వచ్చారు.
నిందితులు ఒక్కసారిగా చాంద్ పాషా కుటుంబ సభ్యులపై కారం చల్లి ఒకరు రంపం మిషన్‌తో మిగతా ఐదుగురు వేట కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. చాంద్‌పాషాతోపాటు సాబీరాబేగం, ఖలీల్‌పాషాలు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడగా వారికి వరంగల్ ఎంజీఎంలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.