Huzurabad Bypoll:సీఎం కేసీఆర్ కు బుద్దిచెప్పే అవకాశమిదే... వాడుకోండి: మాజీ ఎంపీ వివేక్

By Arun Kumar PFirst Published Aug 30, 2021, 1:49 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నిక ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన బుద్ది చెప్పే అవకాశం ప్రజలకు వచ్చిందని బిజెపి నాయకులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. 

కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నిక ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుద్ది చెప్పే మంచి అవకాశం ప్రజలకు వచ్చిందని బిజెపి నాయకులు, మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించడం ద్వారా కుటుంబ పాలనను అంతం చేయవచ్చని హుజురాబాద్ ప్రజలకు వివేక్ సూచించారు. 

''ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా టీఆర్ఎస్ అబద్ధపు జీవోలు విడుదల చేస్తున్నారు. ఆ జీవోలు ఎక్కడా అమలు కావు... ఆన్లైన్ లో ఉండవు. అవినీతిలో దేశంలోనే ముఖ్యమంత్రి కేసీఅర్ మొదటి స్థానంలో వున్నారు'' అని ఆరోపించారు. 

''దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి విజయం తర్వాతే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుండి బయటికి వస్తున్నాడు. ఇప్పుడు ఈటల రాజేందర్ రాజీనామాతో సిఎంఓ అఫీస్ లో ఎస్సీ అధికారులను తీసుకొని జై భీం అంటున్నాడు. కేవలం హుజూరాబాద్ లో ఈటలపై గెలవడానికే సిఎం కేసీఅర్ దళిత బందు పేరుతో మళ్ళీ మోసం చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

read more  దళితబంధు అమలు కాకపోతే యాదగిరిగుట్ట వద్ద ఆత్మహత్య: మోత్కుపల్లి నర్సింహులు

''గతంలో భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వేల ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది... ఆ భూమిని దళితులకు ఎందుకు ఇవ్వడం లేదు?'' అని వివేక్ ప్రశ్నించారు. 

''తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరయినా ధనికులు అయ్యారంటే అది సిఎం కేసీఅర్ అండ్ మెగా కృష్ణారెడ్డి మాత్రమే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఏ పరిస్థితిలో తెలంగాణ ప్రజలు వున్నారో అదే పరిస్థితుల్లో స్వరాష్ట్రంలోనూ వున్నారు'' అని అన్నారు.  

''రాష్ట్రంలో ప్రస్తుతం రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మనోవేదనకు గురిచేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక ఉద్యోగులను కూడా పీఆర్సీ పేరిట మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసకారి ముఖ్యమంత్రికి హుజూరాబాద్ ఎన్నికల్లో బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది'' అని బిజెపి నాయకులు వివేక్ అన్నారు. 


 

click me!