జగిత్యాల: చెట్టును నరికేశారని... రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగిన ప్రకృతి ప్రేమికుడు

By Arun Kumar PFirst Published Aug 30, 2021, 1:16 PM IST
Highlights

పర్యావరణానికి హాని కలిగించేలా పచ్చని చెట్టును నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ జగిత్యాల పట్టణంలో ఓ పర్యావరణ ప్రేమికుడు ధర్నాకు దిగాడు. 

జగిత్యాల: ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ద్వారా మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఇందుకు వ్యతిరేకంగా కాంక్రీట్ జంగల్ విస్తరణలో చెట్లు మాయమవుతున్నాయి. ఇలా తాను నాటిన మొక్క పెరిగి చెట్టుగా మారి పచ్చగా కళకళలాడుతుంటే చూసి అతడు ఆనందించేవాడు. అయితే తాజాగా ఆ చెట్టును నరకడంతో తీవ్ర ఆవేదనకు గురయిన వ్యక్తి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగాడు.  

వివరాల్లోకి వెళితే... జగిత్యాల పట్టణంలోని ఎల్జీ రాం లాడ్జి వెనకవైపు ఓ చెట్టును రాజేశం అనే వ్యక్తి నరికివేశాడు. అయితే ఆ చెట్టును గతంలో తానే నాటానని... ఎంతో జాగ్రత్తగా దాన్ని పెంచానని ప్రభాకర్ అనే వ్యక్తి తెలిపాడు. పర్యావరణ హితం కోసం తాను నాటిన మొక్క వృక్షంగా మారి సమాజానికి ఉపయోగపడే సమయంలో నరికేయడంతో ప్రభాకర్ ఆవేదనకు గురయ్యాడు. దీంతో చెట్టును నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ప్రభాకర్ దర్నాకు దిగాడు. 

read more  వికారాబాద్: వాగులో కొట్టుకుపోయిన కారు... నవ వధువు సహా నలుగురు గల్లంతు వరుడు క్షేమం

ప్రభాకర్ ధర్నాతో జగిత్యాల మున్సిపల్ అధికారులు చెట్టును నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు. చెట్టు నరికిన వ్యక్తికి రూ.5000 జరిమానా విధించిన అధికారులు అదే చోట మరో మొక్కను నాటారు. దీంతో ప్రభాకర్ తన నిరసనను విరమించుకున్నారు.  

పచ్చని వృక్షాల పట్ల ఇంత ప్రేమను ప్రదర్శించిన ప్రభాకర్ ను స్థానికులు ప్రశంసిస్తున్నారు. అతడి లాగే ప్రతిఒక్కరు చెట్లను సంరక్షిస్తే పచ్చదనం పెరిగి పర్యావరణం సమతుల్యంగా వుంటుందని అంటున్నారు. ఇష్టం వచ్చినట్లు చెట్లను నరికేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.  

click me!