Huzurabad Bypoll: మీరసలు మనుషులా పశువులా... ఓ అమ్మకు పుట్టలేదా?: ఈటల ఫైర్

By Arun Kumar PFirst Published Oct 4, 2021, 3:15 PM IST
Highlights

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో జరిగిన కిసాన్ మొర్చ సమావేశంలో పాల్గొన్న బిజెపి అభ్యదర్థి ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కరీంనగర్: ఈ నెల 13, 14వ తేదీల్లో మా కార్యకర్తలతో నేనే దాడి చేయించుకుంటానని ఓ మంత్రి, ఎమ్మెల్యే చెబుతున్నారని... ఈ కామెంట్స్ నాలో అనుమానాలను రేకెత్తిస్తున్నాయని మాజీ మంత్రి, హుజురాబాద్ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తనకు గన్ మెన్లు తగ్గించారు... మాజీ మంత్రికి ఒకే ఒక గన్ మెన్ ను ఇచ్చారంటే ఏదైనా కుట్ర కేసీఆర్ చేస్తున్నాడేమో అన్న అనుమానం వస్తోందన్నారు. ఇలాంటి కుట్రలకు హుజురాబాద్ ప్రజలు ఘోరీ కడతారని అన్నారు. అసలు మీరు మనుషులా, పశువులా... మీకు సంస్కారం ఉందా... మీరు ఓ అమ్మకు పుట్టలేదా? మీకు భార్యలు లేరా? అంటూ ఈటల మండిపడ్డారు. 

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో కిసాన్ మొర్చ సమావేశానికి ఈటల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంత్రి హరీశ్ రావుపై ఒకప్పుడు గౌరవం ఉండేదని... కానీ అబద్ధాల కోరులా మాట్లాడుతున్న ఆయనపై ఇప్పుడు గౌరవం పోయిందన్నారు. మామ కేసీఆర్ కు బానిసయి తనపై హరీష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఈటల అన్నారు. 

''మీడియా యజమానులారా, ప్రజాస్వామ్యాన్ని కోరే మేధావుల్లారా.. హుజురాబాద్ లో ఏం జరుగుతుందో దృష్టి పెట్టండి. ఈ పరంపర రాబోయే కాలంలో కొనసాగితే తెలంగాణ బానిసత్వంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది'' అని ఈటల పేర్కొన్నారు. 

''టీఆర్ఎస్ మీటింగులకు బయట నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించి మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్ ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే ప్రజలు కాదు. కేసీఆర్ కు టీఆర్ఎస్ గెలుస్తుందన్న విశ్వాసం లేక తొండాట ఆడుతున్నాడు. జిత్తుల మారి ఎత్తులతో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడు. తన టక్కుటమార విద్యలు ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ చెల్లవని చెప్పే రోజు ఈనెల 30వ తేదీ'' అని అన్నారు ఈటల. 

READ MORE  Huzurabad Bypoll: టీఆర్ఎస్ కు షాకిచ్చేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు రెడీ... భారీ నామినేషన్లు

''నా కొడుకంత వయసున్న ఒక వ్యక్తి నన్ను తమ్మి అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమంగా సంపాదించిన వేల కోట్లు తెచ్చి ఇక్కడ ఖర్చు చేస్తున్నాడు. ఈటలను ఓడిస్తే మరో 20ఏళ్లు తెలంగాణ సమాజాన్ని బానిసత్వంలో ఉంచవచ్చని కుట్ర చేస్తున్నాడు. ఒకడికి రూ.50 లక్షలు ఇచ్చి కరపత్రాలు కొట్టించి నాకు వ్యతిరేకంగా దళితవాడల్లో పంచిస్తున్నాడు. డబ్బులు తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టేవాళ్లు, కరపత్రాలు పంచేవాళ్లు హుజురాబాద్ కు కోకొల్లలుగా వచ్చారు'' అన్నారు. 

''ఎర్ర చీమకు కూడా నేను అన్యాయం చేయలేదు. గడ్డిపోచను కూడా గౌరవించిన వ్యక్తిని నేను. నాలాంటి వ్యక్తి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ బాధకు చరమగీతం పాడేలా.. కేసీఆర్ చెంప చెల్లుమనిపించే తీర్పు ఇవ్వాలి'' అని ఈటల సూచించారు. 

''కుక్కను చంపాలంటే పిచ్చికుక్క అనే ముద్ర వేసినట్లుగా... నన్ను ఎదుర్కొనే దమ్ములేక, కారణం చెప్పే ధైర్యం లేక భూ ఆక్రమణ ఆరోపణలు చేసారు. ఒక్క ఎకరం ఆక్రమించుకున్నా ముక్కు నేలకు రాస్తా.. లేకుంటా నీవు రాస్తావా అని నా భార్య సవాల్ చేస్తే స్పందించలేదు'' అని గుర్తుచేశారు.

''ఆనాడు వైఎస్ మంత్రి పదవి ఆఫర్ చేసినా నేను లొంగలేదు. ఉద్యమాన్ని ఆర్పాలని ఓ ముఖ్యమంత్రి నా భూమి లాక్కున్నా నేను భయపడలేదు. మరో ముఖ్యమంత్రి నయీం హంతకముఠాతో నా డ్రైవర్ ను కిడ్నాప్ చేయించడమే కాదు నన్ను చంపుతానని బెదిరించినా భయపడలేదు. అలాంటిది ఇప్పుడు ఈ తాటాకు చప్పుళ్లకు బెదురుతానా? మీ బెదిరింపులకు నేను సమాధానం చెప్పను... మా ప్రజలే మీకు సమాధానం చెబుతారు'' అన్నారు.

READ MORE  13, 14వ తేదీల్లో వాళ్లు నాపై దాడి చేస్తారేమో.. వాటికి కేసీఆరే బాధ్యత వహించాలి: ఈటల

''గొర్రెల మంద మీద తోడేళ్లలాగా మంత్రులు, ఎమ్మెల్యేలు నా లాంటి బక్కపల్చటోని మీద పడటం న్యాయమా?  తెలంగాణను కాపాడుకునే బాధ్యత యావత్ సమాజంపై ఉంది. కేసీఆర్ అహంకారాని, డబ్బుకు... ఈటల రాజేందర్ ధర్మానికి మధ్య పోరాటం జరుగుతోంది'' అన్నారు. 

''ఎన్నికలు వస్తేనే ప్రజల సమస్యల గుర్తొస్తాయి. కేసీఆర్ కు ఓట్ల మీద తప్ప ప్రజలపై ప్రేమలేదు. దళితబంధు ఇవ్వాల్సిందే... దానితో పాటు అన్ని కులాల్లోని పేదలకు కూడా పది లక్షలు ఇవ్వాలి.  నా హుజురాబాద్ లైఫ్ లైన్ భూమి, పంట మాత్రమే.. అందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండాలని డిమాండ్ చేసాను... అది తప్పా? కేంద్రం వడ్లను కొనమని చెబుతోందని కేసీఆర్ ప్రచారం చేస్తున్నాడు. ఈ విషయం గురించి నేను సంబంధిత కేంద్రమంత్రిని అడిగాను. అదంతా అబద్ధమని ఆ మంత్రి చెప్పారు. కాబట్టి వడ్లు ఈసారి కూడా కొంటారు. కేంద్ర ప్రభుత్వం సహకారంపై మేము హామీ ఇస్తున్నాం'' అని ఈటల పేర్కొన్నారు. 

''కేసీఆర్ డబ్బును, మోసాన్ని, దౌర్జన్యాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. నాతో ఎవరైనా తిరిగితే ఓ కారు వచ్చి వాళ్ల ఇంటి ముందు ఆపి హరీశ్ దగ్గరకు తీసుకెళ్తున్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు 10 వేల రూపాయలు వస్తున్నాయని కేసీఆర్ కు కళ్లు మండాయి. వాళ్లు డబ్బు సంపాదించుకుని సర్పంచులుగా పోటీ చేస్తున్నారని భావించి వాళ్లను తీసేసాడు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పన్నులతో కేసీఆర్ సోకులు చేసుకుంటున్నాడు. నన్ను గెలిపించి హుజురాబాద్ లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్టవేయాలి'' అని కిసాన్ మొర్చ నాయకులకు సూచించారు. 
 

click me!