కేంద్రం దయాదాక్షిణ్యాలపై నిధులు రావు, రాష్ట్రాల హక్కు: కాంగ్రెస్ సభ్యులపై కేసీఆర్ ఫైర్

By narsimha lodeFirst Published Oct 1, 2021, 11:28 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సభ్యులపై విరుచుకు పడ్డారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయితీలకు ఏ మేరకు నిధులు ఖర్చు చేసిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుల మాటలను చూస్తే జాలి కలుగుతోందన్నారు.

హైదరాబాద్: కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నిధులు రావని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్రం నుండి వచ్చే నిధులేమీ ఉండవన్నారు.కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లింపు అనేది సత్యదూరమని కేసీఆర్ తేల్చి చెప్పారు.తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు శుక్రవారం నాడు  మంత్రి దయాకర్ రావు సమాధానమిచ్చారు.ఈ సమయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని విపక్ష కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. 

  ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారంగా కేంద్రం నిధులు  ఇస్తోందని ఆయన చెప్పారు. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని సీఎం చెప్పారు. ఇది రాష్ట్రాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని కేసీఆర్ గుర్తు చేశారు. అబద్దాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు.

ఏది పడితే అది మాట్లాడడానికి ఇది ఫ్లాంట్‌ఫాం కాదు, ఇది శాసనసభ అని కేసీఆర్ విపక్ష సభ్యులకు హితవు పలికారు.పంచాయితీరాజ్ గ్రాంట్లు ఆపొద్దని తానే చాలా సార్లు అధికారులకు సూచించిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం నుండి ఎన్ని నిధులు వస్తున్నాయో  ప్రతిపక్షాలకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

మన రాష్ట్రంలోని గ్రామాలను చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర సర్పంచులే గౌరవంగా బతుకుతున్నారని ఆయన వివరించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ఈ సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.  అన్ని పంచాయితీలకు సమ న్యాయం  జరగాలని కొత్త పాలసీ తీసుకొచ్చామని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో  గ్రామ పంచాయితీలకు తలసరి గ్రాంట్ రూ. 4 లేనని ఆయన గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వ హయంలో తలసరి గ్రాంట్ రూ. 650  విడుదల చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.సర్పంచ్‌లు ఎక్కడ ఆగమయ్యారని కేసీఆర్ కాంగ్రెస్ సభ్యులను ప్రశ్నించారు. మన రాష్ట్రంలో సర్పంచ్‌లే గౌరవంగా బతుకుతున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. మన గ్రామాలకు అనేక అవార్డులు వచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో అభివృద్దిని  చూసి విపక్షలు ఓర్వలేకపోతున్నాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుల మాటలను వింటే జాలేస్తోందన్నారు.

ఏకగ్రీవమైన గ్రామ పంచాయితీలకు నిధులు ఇస్తామని తాము చెప్పలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశమే లేదన్నారు. కోయగూడలు కూడ తమ పాలనలో బాగుపడ్డాయని చెప్పారు సీఎం. వ్యక్తులను కాకుండా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొంటున్నామన్నారు.

click me!