యూపీఏకు మద్దతు ఇచ్చేందుకు మేము ఎంత డబ్బు తీసుకున్నాం?: రాహుల్‌కు అసదుద్దీన్ ప్రశ్నలు..

By Sumanth Kanukula  |  First Published Nov 2, 2023, 10:42 AM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంఐఎం డబ్బులు తీసుకుని బీజేపీ కోసం పనిచేస్తుందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు.
 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఎంఐఎం డబ్బులు తీసుకుని బీజేపీ కోసం పనిచేస్తుందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. రాహుల్ ఆరోపణలపై స్పందిస్తూ.. గతంలో తాము యూపీఏకు మద్దతు ఇవ్వడానికి ఎంత డబ్బు తీసుకున్నామని అసదుద్దీన్ కౌంటర్ అటాక్ చేశారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రశ్నలు సంధించారు. 

2008 అణు ఒప్పందంలో యుపిఎకు మద్దతు ఇవ్వడానికి ఎంత డబ్బు తీసుకున్నామని అసదుద్దీన్ అడిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడాని ఎని డబ్బులు తీసుకున్నామని సెటైరికల్‌గా ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతివ్వాలని జైలులో ఉన్న వైఎస్‌ జగన్‌ రెడ్డిని కలిసి ఒప్పించినందుకు నాకు ఎంత డబ్బు వచ్చింది అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. 

Latest Videos

అంతే కాకుండా అమేథీ ఎన్నికల్లో ఉచితంగా ఓడిపోయారా లేక డబ్బులు అందాయా అని రాహుల్  గాంధీని అసదుద్దీన్ ప్రశ్నించారు. ‘‘2014 నుంచి ఇప్పటి వరకు మీరు ఓడిపోయారు.. అందుకు నేను బాధ్యుడిని కాదు’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు. 

ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీతో కాంగ్రెస్ ఎక్కడ పోరాడినా బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఎంఐఎం అభ్యర్థులను నిలబెడుతుందని ఆరోపించారు. ‘‘ఎన్నికల్లో పోరాడేందుకు మనం ఎక్కడికి వెళ్లినా.. అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, త్రిపుర ఇలా ఎక్కడైనా బీజేపీతో కాంగ్రెస్ పోరాడితే అక్కడ బీజేపీ నుంచి ఎంఐఎం డబ్బులు తీసుకుని అభ్యర్థులను నిలబెడుతుంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఈ విధంగా స్పందించారు. 

click me!