మాజీ ఐఆర్ఎస్ అధికారి వందకోట్ల ఆస్తి మీద కన్నేశాడో ఎస్సై. దీనికోసం హనీట్రాప్ కు పథకం వేశాడు. అది బెడిసికొట్టడంతో ప్లాన్ బికి తెరలేపాడు.
హైదరాబాద్ : మాజీ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన ఇంట్లో ఆస్తిపత్రాల అపహరణ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాదులోని ఇంట్లో శామ్యూల్ ఒంటరిగా ఉంటున్నారు. ఆయనకు వందల కోట్లలో ఆస్తి ఉంది. భార్య చనిపోయింది. పిల్లలంతా అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఆయన ఆస్తి మీద కన్నేశారు కొంతమంది. దుండిగల్ ఎస్సై కృష్ణ, రియాల్టర్ సురేందర్ ఆస్తి కాజేయడం కోసం పక్కా ప్రణాళిక వేశారు. అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే పథకాన్ని అమలు చేశారు.
ఈ పథకంలో భాగంగానే మాజీ ఐఆర్ఎస్ అధికారి మీదికి ఓ మహిళను ప్రయోగించారు. ఆమెతో హనీ ట్రాప్ చేయించి, ఆస్తి మొత్తం కాజేయాలని ఆలోచించారు. వలపు వల వేసి, ఆ అధికారిని ప్రేమలోకి దింపి.. పెళ్లి చేయించాలని.. ఆ తరువాత ఆస్తి మొత్తం కాజేయాలనుకున్నారు. దీంట్లో భాగంగానే తాము అనుకున్నట్లుగా సహకరించే లక్షణాలున్న ఓ మహిళను.. శామ్యూల్ ఇంట్లో పనిమనిషిగా ప్రవేశపెట్టారు.
undefined
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. తండ్రి, కూతురు అరెస్ట్.. సిట్ అదుపులో మరో ఆరుగురు..!!
ఎస్సై కృష్ణ, రియాల్టర్ సురేందర్ రెడ్డిలతో పాటు ఈ పథకంలో కృష్ణ రెండో భార్య పాపకు కూడా ఈ పథకంలో భాగం ఉందని తేలింది. శామ్యూల్ తన ఆస్తిలో కొంత భూమిని ఎస్ఐ కృష్ణ, సురేందర్ లకు గతంలో విక్రయించారు. ఆ సమయంలోనే ఆయనకు కోట్లలో ఆస్తులు ఉన్నాయనే విషయం వీరిద్దరికీ తెలిసింది. అప్పుడే వీరి కన్ను ఆయన ఆస్తి మీద పడింది. ఎలాగైనా ఆస్తిని కాజేయాలని ఈ పథకానికి ప్రణాళిక వేశారు.
పాత నేరస్తుడైన శ్రీశైలం, ఆశీర్వాదం అనే వ్యక్తులతో పాపకు పరిచయం ఉంది. తమ పథకంలో భాగంగా ఓ పనిమనిషి కోసం వెతుకుతూ వీరిద్దరి సహాయం తీసుకుని సుమలత అనే మహిళను ఎంపిక చేసింది. అలా ఒంటరిగా ఉంటున్న శ్యామ్యూల్ ఇంట్లో ఆమెను పనిమనిషిగా చేర్చారు. కొద్ది రోజుల తర్వాత శ్రీశైలం, ఆశీర్వాదం, రియాల్టర్ సురేందర్ లు శామ్యూల్ ను కలిసి కలిసిన సమయంలో రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అంటూ చెప్పుకొచ్చారు.
దీనికోసం అన్ని రకాలుగా సపర్యలు చేస్తూ.. బాగా చూసుకుంటున్న సుమలతను చేసుకోమంటూ సూచించారు. అయితే దీనికి శామ్యూల్ ఒప్పుకోలేదు. వారు అప్పటికి ఆ విషయాన్ని వదిలేశారు. కొద్ది రోజుల తర్వాత సుమలత కూడా ఈ పని చేయడం తన వల్ల కాదంటూ మానేసింది. దీంతో వారు అనుకున్న పథకం బెడిసి కొట్టినట్టు అయింది. అయితే ఎస్ఐ కృష్ణ, రియాల్టర్ సురేందర్ రెడ్డిల దగ్గర ప్లాన్ ఏ ఫెయిల్ అయితే.. ప్లాన్ బి కూడా ఉంది. ఆ ప్లాన్ బి ప్రకారం సురేందర్.. సామ్యూల్ కు మత్తుమందు కలిపిన టిఫిన్ తినిపించాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న నగదు, ఆస్తి పత్రాలు ఎత్తుకెళ్లాడు.
ఆ పత్రాలను దుండిగల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై కృష్ణకు ఇచ్చాడు. కాగా ఇంట్లో నగదు ఆస్తి పత్రాలు మాయమైన సంగతి తెలుసుకున్న శామ్యూల్ వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో, ఇంట్లో పత్రాలను దొంగిలించిన సురేందర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు వెలుగులోకి వచ్చిన రెండు రోజుల్లోనే కృష్ణని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయనను డీజీపీ ముందు హాజరు పరిచారు. కేసు విచారణ ముగిసే దాకా హైదరాబాదులోనే ఉండాలని డీజీపీ ఆదేశించారు. విచారణ కోసం పోలీసులు ఎప్పుడు పిలిచిన హాజరు కావాలన్నారు.
మరోవైపు.. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన శ్రీశైలం, ఆశీర్వాదాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనిమనిషి సుమలతను కూడా విచారిస్తున్నారు. ఈ విషయాలు తెలిసిన ఎస్ఐ కృష్ణ.. ఆ ముగ్గురు కనక నిజాలను బయట పెడితే ఈ పథకంలో తనకు.. తన రెండో భార్య పాపకు భాగస్వామ్యం ఉందన్న విషయం తెలిసిపోతుందని ఆందోళన చెందాడు. దీంతో తన రెండో భార్యతో కలిసి పారిపోయాడు. ప్రస్తుతానికి ఎస్ఐ కృష్ణ, ఆయన రెండో భార్య పాప ఎక్కడికి వెళ్లారు ఆచూకీ లేదు. దీంతో పోలీసులు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.