జల వివాదం.. ఏపీ - తెలంగాణ నేతల మధ్య మాటల తూటాలు: సాగర్ వద్ద భారీ భద్రత

By Siva Kodati  |  First Published Jun 30, 2021, 7:18 PM IST

కృష్ణా నదీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్, ఆర్డీఎస్ కాలువ పనుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజుల నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకుంది


కృష్ణా నదీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్, ఆర్డీఎస్ కాలువ పనుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజుల నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకుంది. నిత్యం ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద నల్గొండ జిల్లా పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రధాన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ స్వయంగా సాగర్‌ జలాశయం వద్దకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం.. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వద్ద ఎస్పీఎఫ్‌ సిబ్బందితో పాటు ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 100 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే ఏపీ - తెలంగాణ అంతర్‌ రాష్ట్ర సరిహద్దు వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  

Latest Videos

Also Read:మీకంటే ఎక్కువే మాట్లాడగలం.. చేతకాకకాదు : తెలంగాణ మంత్రులకు అనిల్ కుమార్ కౌంటర్
  
కాగా, రైతుల అవసరాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఏపీ మంత్రులు పేర్ని నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్ మీడియా సమావేశంలో ఆరోపించారు. తెలంగాణ వైఖరిపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖలు రాస్తామని వారు వెల్లడించారు. మరో వైపు .. ఎన్జీటీ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్దని చెప్పినా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కేఆర్ఎంబీ కమిటీ బృందం జూలై 3న రెండు ప్రాజెక్ట్‌లను సందర్శించనుంది. 

click me!