అది తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ: రేవంత్ నియామకంపై విజయసాయి ట్వీట్‌... కోమటిరెడ్డి రీట్వీట్

By Siva KodatiFirst Published Jun 30, 2021, 5:50 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ అంశం చిచ్చురాజేసింది. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లు హైకమాండ్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎంపిక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ అంశం చిచ్చురాజేసింది. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లు హైకమాండ్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వీరిలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందు వరుసలో వున్నారు. పీసీసీని ఇన్‌ఛార్జ్ అమ్ముకున్నారని... అది టీపీసీసీ కాదని టీడీపీ పీసీసీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే ఆధారాలు బయటపెడతానన్నారు. అంతేకాదు ఇకపై గాంధీ భవన్‌ మెట్లెక్కనని.. నియోజకవర్గానికే పరిమితమవుతానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇదిలావుండగా రేవంత్ నియామకంతో అసలు ఏమాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ చెందిన ముఖ్యనేత ఎంపీ విజయసాయిరెడ్డి సైతం స్పందించారు. 28వ తేదీనాడు ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. 

పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టుపట్టించాడు. ఇప్పుడు డైరెక్టుగా తన కంట్రోల్లోకి  తెచ్చుకున్నాడు.

కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు బిజెపి తీర్థం ఇప్పించాడు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణా పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించాడు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్ లోకి  తోలాడు. బాబా మజాకా!

రాహుల్ గాంధీని ‘ఇంప్రెస్’ చేయడానికి ఏం ‘మంత్రం’ వేశాడో గాని టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపిక చేయకుండా అడ్డుకున్నాడు. అన్ని అడ్డంకులు క్లియర్ చేసి తన మనిషిని పీసీసీ సీట్లో కూర్చోబెట్టాడు. తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ(TBCC) అనాలేమో ఇక అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేశారు. తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్‌ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రీట్వీట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

 


 

click me!