
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో భూ సేకరణ కు సంబంధించి ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 123ని హైకోర్టు గురువారం కొట్టేసింది. ఈ జీవో ప్రకారం భూసేకరణ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం 2013 కంటే మరింత మిన్నగా తాము కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జీవో 123 ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవో పై ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
ముఖ్యంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలో భూ సేకరణ ఈ జీవో కిందే సాగుతుండడం తీవ్ర పరిణామాలకు దారి తీసింది. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో పాటు తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా జీవో 123 కి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసింది.అయినా కూడా ప్రభుత్వం ఈ జీవోపై వెనక్కి తగ్గలేదు.
కాగా, హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం అన్నారు. గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవో 123 ప్రకారం భూసేకరణ నిలిపివేసి, 2013 భూసేకరణ చట్టాన్నే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
123 జీవోతో నిర్వాసితులకు మరింత అన్యాయం జరుగుతుందన్నారు. జేఏసీ ప్రత్యామ్నాయ సూచనలు చేస్తుందని తెలిపారు.