కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై హైకోర్టు విచారణ.. కౌన్సిల్ నిర్ణయంపై ప్రభుత్వ వైఖరి తెలుపాలని ఆదేశం..

By Sumanth KanukulaFirst Published Jan 25, 2023, 12:33 PM IST
Highlights

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి బుధవారం హైకోర్టులో విచారణ జరగగా.. మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందన్న పిటిషన్ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. 

ఈ క్రమంలోనే కౌన్సిల్ నిర్ణయంపై ప్రభుత్వ వైఖరి రెండు వారాల్లో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను కౌంటర్ అఫిడవిట్‌లో పొందుపరచాలని  తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది. 

ఇదిలా ఉంటే.. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి  తెలిసిందే. రైతుల ఆందోళనలను ప్రతిపక్షాలు కూడా మద్దతుగా  నిలిచాయి. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మున్సిపల్‌ కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి.. ముసాయిదాను రద్దు చేసింది. మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానాన్ని కౌన్సిలర్లంతా ఆమోదించారు. డిజైన్ డెవలప్‌మెంట్ ఫోరం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలని కౌన్సిల్ అత్యవసర సమావేశంలో నిర్ణయించినట్లు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ జాహ్నవి తెలిపారు. రైతుల భూముల్లో పారిశ్రామిక జోన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని జాహ్నవి స్పష్టం చేశారు.

click me!