
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కు స్వల్ప ఊరట లభించింది. గురుకుల డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల రాతపరీక్షపై విధించిన స్టే ను ఎత్తేసింది హైకోర్టు. దీంతో డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు రాత పరీక్షలను నిర్వహించే వెసులుబాటు టిఎస్పిఎస్సీ కి స్వల్పంగా లభించింది.
టిఎస్పిఎస్సీ నిర్వహించే డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో ఎక్కువ పోస్టులు సుమారు 500 పోస్టులు మహిళలకు కేటాయించడాన్ని కొందరు నిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఆ సమయంలో సింగిల్ బేంచ్ పరీక్షల నిర్వహణను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అయితే దానిపై వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ స్టే ఎత్తివేస్తూ నిర్ణయం వెలువరించింది. ఆడపిల్లల గురుకులాలు కాబట్టి అక్కడ మగవారికి ఉద్యోగాలు ఇవ్వలేమన్న వాదనను తెలంగాణ సర్కారు, టిఎస్పిఎస్సీ నుంచి వాదనలు వినిపించారు. దీంతో న్యాయస్తానం ఏకీభవించి స్టే ను ఎత్తేసింది. దీంతో గురుకుల డిగ్రీ లెక్చరర్ల పరీక్ష నిర్వహణకు పాక్షికంగా లైన్ క్లియర్ అయింది.
అయితే ఇక్కడ మరో చిక్కు ముడి ఉంది. తెలంగాణ సర్కారు వెలువరించిన జి నెంబరు 1274 లింగ వివక్ష చూపేలా ఉందంటూ కొందరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్ హైకోర్టు వద్ద పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఇచ్చిన తీర్పు ప్రకారం పరీక్షలకు అనుమతి లభించే అవకాశం ఉంది. కానీ 1274 జిఓ విషయంలో ఇంకా హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి పరీక్షలు జరుగుతాయా? లేక 1274 జిఓ పైనా క్లారిటీ వచ్చే వరకు టిఎస్పిఎస్సీ పరీక్షలను జరపకుండా వాయిదా వేస్తుందా అన్నది తేలాల్చి ఉంది.