వరంగల్ జిల్లా, గీసుకొండలో గుప్తనిధులు కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తికి చెందిన స్థలంలో కిలోల కొద్దీ బంగారం దొరికినట్టుగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఆడియో వైరల్ అయ్యింది. అయితే పోలీసులు మాత్రం.. అవి రాగి నాణేలే అంటున్నారు.
గీసుకొండ : Hidden treasures తవ్వకాలు లో పెద్ద ఎత్తున gold లభించినట్లు Gangadevipalliలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గ్రామానికి చెందిన యార మల్లారెడ్డి, మరో ఏడుగురు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా 1818 వ సంవత్సరం నాటి 30 రాగినాణేలు బయటపడ్డాయి. ఆదివారం వాటిని విక్రయించేందుకు వెళ్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ తవ్వకాల్లో పెద్ద ఎత్తున బంగారు బిళ్ళలు దొరికినట్లుగా గీసుకొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఆడియో టేప్ social mediaల్లో వైరల్ అవుతుంది.
వారి మాటల ప్రకారం డిసెంబర్ 24న గుప్తనిధులు గుర్తించి బయటకు తీశారు. అందరూ సమానంగా పంచుకోవాలనుకున్నారు. అయితే అందులో నలుగురు మిగతా వారి కళ్లు కప్పి బంగారం మాయం చేశారు. ఇందులో సుమారు 140 కిలోల నుంచి మూడు క్వింటాళ్ల వరకు బంగారం ఉండి ఉంటుందని వారు సంభాషించుకున్నారు. గుప్త నిధులను బయటకు తీసేందుకు కోడెను బలిచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. అయితే రాగి నాణేలు మాత్రమే దొరికాయని పోలీసులు చెబుతున్నారు.
డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. యారా మల్లారెడ్డికి గంగాదేవి గ్రామంలో సర్వే నంబర్ 375 లో 1.8 ఎకరాల భూమి ఉంది. భూమిలో గుప్తనిధులు ఉన్నట్లుగా తెలుసుకున్నాడు. రెవెన్యూ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉన్నా.. అలా చేయలేదు. గుప్తనిధులు వెలికితీయాలని నిర్ణయించుకున్న మల్లారెడ్డి గతనెల 23న అదే గ్రామానికి చెందిన పంజర బోయిన శ్రీనివాస్, మేడిద కృష్ణ, యాట పూర్ణచందర్ లతో కలిసి తవ్వకాలు జరిపాడు. ఈ తవ్వకాల్లో 1818 కాలం నాటి 30 రాగి నాణేలు బయటపడ్డాయి. వీటిని మహేష్ సాయంతో హైదరాబాదులో విక్రయించేందుకు మరుసటి రోజు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
టాస్క్ఫోర్స్ అధికారులకు సమాచారం తెలియడంతో నిందితులపై నిఘా పెట్టారు. హైదరాబాద్ లో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా వరంగల్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితులను గీసుకొండ పిఎస్ లో అప్పగించినట్లు తెలిపారు.
అయితే, గంగదేవిపల్లిలో యార మల్లారెడ్డి జరిగిన జరిపిన తవ్వకాల్లో పెద్ద ఎత్తున బంగారం లభ్యమైనట్లు గ్రామస్తుల మధ్య చర్చ జరుగుతోంది. రాగి నాణేలతో పాటు దాదాపు వెయ్యి బంగారు నాణాలు లభ్యమైన విషయం వారం రోజుల క్రితం గ్రామస్తులకు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే విషయం బయటకు తెలిస్తే అసలుకే మోసం వస్తుందనే ఉద్దేశంతోనే బంగారం విషయం వెలుగులోకి రాకుండా రాగి నాణేలు దొరికినట్లుగా సీన్ క్రియేట్ చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదని చెబుతున్నారు.
గంగాదేవి పల్లిలో జరిగిన గుప్తనిధుల తవ్వకాల్లో భారీ ఎత్తున బంగారం లభ్యమైన విషయం ఇద్దరు పెద్ద నేతలకు తెలియడంతో.. విషయం ఆరా తీసి వాటాలు కోరుతున్నట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. కేసును నీరుగార్చేందుకు, నిందితులను ఈ కేసు నుంచి రక్షించేందుకు బేరసారాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.