
హైదరాబాద్: ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామున హైదరాబాద్ (hyderabad) శివారులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం రెండు కుటుంబాల్లో చీకట్లు నింపింది. మేడ్చల్ జిల్లా (medchal district)లో ఓ కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు.
పూల వ్యాపారం చేసే షకీర్(30), అప్సర్(55) లు మంగళవారం తెల్లవారుజామున తూప్రాన్ నుండి హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్ కు బయలుదేరారు. అయితే వీరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా హైదరాబాద్ శివారులోని కండ్లకోయ వద్దకు రాగానే ప్రమాదానికి గురయ్యారు. గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్లుంది కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. కారులోని షకీర్, అప్సర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో మరోవ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే నిన్న(సోమవారం) కూడా ఇలాగే హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్ సమీపంలో సాగర్ రహదారిపై ఓ కారు ప్రమాదానికి గురయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వెళుతుండగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతులు వట్టినాగులపల్లికి చెందిన తలపల్లి రామకృష్ణ, మాటూరి శ్రీకాంత్ లుగా గుర్తించారు. కారు అతి వేగంగా వెళుతుండగా టైరు పేలి పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ లింగంపల్లి నుంచి యాచారం మండలం మాల్ లో జరిగిన వివాహానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.