ఈ నెల 4 నుండి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. కొన్ని జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 4 నుండి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రెండు రోజుల్లో తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో సాధారణం కంటే అధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జూన్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వారం రోజుల పాటు కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మరింత ఆలస్యంగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ పెద్దగా వర్షాలు కురవలేదు.
undefined
అయితే ఈ నెల 4వ తేదీ నుండి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ 24 నుండి మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదు కానుందని నైరుతి రుతుపవనాల ప్రవేశించకముందే ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం ఉత్తరాది ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఇప్పటివరకు వర్షాలు కురిసినట్టుగా గణాంకాలు నమోదు కాలేదని సమాచారం.