జలపాతాన్ని చూసేందుకు వెళ్లి..  అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులు..

By Rajesh Karampoori  |  First Published Jul 27, 2023, 4:03 AM IST

భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న ముత్యం ధార (Muthyam Dhara) జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన 84 మంది పర్యాటకులు అడవిలో చిక్కుకుపోయారు . వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. 


గత వారం రోజులుగా తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తెడలు దూకుతున్నాయి. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.  ఈ భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు..  అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు వెళ్లకూడదని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. కానీ, కొంత మంది.. భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న ముత్యం ధార (Muthyam Dhara) జలపాతాన్ని చూసేందుకు వెళ్లి చిక్కుకున్నారు. దాదాపు 84 మంది పర్యాటకులు అడవిలో చిక్కుకుపోయారు. 

ములుగు (Mulugu)జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యం ధార జలపాతం (Muthyam Dhara) ఉంది.  వెంకటాపురం మండల కేంద్రానికి 9 కి.మీ. దూరంలో ఈ జలపాతం ఉన్నాయి.  బుధవారం (జూలై 26) ఉదయం ఈ జలపాత అందాలను వీక్షించడానికి  దాదాపు 84 మంది పర్యాటకులు వెళ్లారు.  ఈ జలపాతాన్ని చూడటానికి కొంత మంది కార్లలో వెళ్లగా.. కొంత మంది యువతీ యువకులు బైకులపై వెళ్లారు. జలపాతానికి కొంత దూరంలో వాహనాలను పార్క్ చేసి.. కాలి నడకన  అడవి మార్గంలో జలపాతం వద్దకు చేరుకున్నారు.

Latest Videos

అంత బాగానే ఉంది కానీ..  జలపాతాన్ని చూసి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఉన్న వాగు పొంగిపొర్లింది. దీంతో పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. దిక్కుతోచని స్థితిలో సహాయం కోరుతూ... పోలీసులకు, హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, NDRF బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు ములుగు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. సాధ్యమైనంత త్వరగా వారిని రక్షించి సురక్షితంగా తీసుకోస్తామని తెలిపారు. వారిని అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.  అడవిలో చిక్కుకున్న పర్యాటకులు వీరభద్రపురంలో కార్లు, ద్విచక్ర వాహనాలు పార్కు చేసి ఉంచినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.  ముత్యందార జలపాతం సందర్శనకు వెళ్లి అడవిలో చిక్కుకున్న పర్యాటకుల పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్, ఎస్పీ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.   తక్షణమే సహాయచర్యలు చేపట్టి.. పర్యాటకులను రక్షించాల్సిందిగా అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పర్యాటకులంతా క్షేమంగానే ఉన్నారని బాధిత కుటుంబసభ్యులు దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. 

click me!