తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు.. న‌లుగురు మృతి, నీట మునిగిన అనేక‌ ప్రాంతాలు

By Mahesh Rajamoni  |  First Published Sep 4, 2023, 4:50 PM IST

Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట‌మునిగాయి. అనేక ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. న‌గరంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రత పెరిగే అవకాశం ఉందనీ, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతావరణ సలహా హెచ్చరికలు జారీ చేసింది.
 


Telangana rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట‌మునిగాయి. రాష్ట్రంలో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు నలుగురు మృతి చెందారు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, ఓ వృద్ధురాలు వాగులో కొట్టుకుపోయింది. 45 రోజుల పొడి వాతావరణం తర్వాత శని, ఆదివారాల్లో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. సోమ‌వారం కూడా చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో వ‌ర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రానున్న రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఆదిలాబాద్, భూపాలపల్లి ఉమ్మడి జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి నదులు పొంగిపొర్లుతున్నాయి.

Latest Videos

పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తడంతో రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లో ఆదివారం 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కనుకుల (11.4 సెం.మీ), పెద్దలింగాపురం (10.8 సెం.మీ), సుగ్లంపల్లి (10.4 సెం.మీ)లలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని బోరబండ, జగద్గిరిగుట్ట, మోతీనగర్, సనత్ నగర్, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. యూసుఫ్ గూడ, కృష్ణానగర్ , అబిడ్స్ , కూకట్ పల్లి, కేపీహెచ్ బీ కాలనీ తదితర ప్రాంతాల్లోని పలు రహదారులు జలమయమయ్యాయి. హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమ‌వారం దాదాపు హైద‌రాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం ప‌డుతోంద‌ని స‌మాచారం.

సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

click me!