ఎవరికీ బీ టీమ్ కాదు.. ప్రాణాలైనా విడుస్తాం , బీజేపీతో కలిసి నడవం : రేవంత్ రెడ్డికి అక్బరుద్దీన్ కౌంటర్

By Siva Kodati  |  First Published Dec 21, 2023, 6:21 PM IST

విద్యుత్ బకాయిలపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య మాటల యుద్ధం నడిచింది.  ఎంఐఎంను బీజేపీకి బీ టీమ్ అంటున్నారని.. తాము బతికున్నంత వరకు బీజేపీతో కలిసి పనిచేసేది లేదని ఒవైసీ తేల్చిచెప్పారు. 


విద్యుత్ బకాయిలపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీకి మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ మొండి బకాయిల్లో గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ సౌత్ టాప్‌లో వున్నాయన్నారు. శ్రీశైలం ఎడమ కాలువలో సొరంగం బ్లాస్ట్ అయి 9 మంది చనిపోయారని, వారిలో ఏఈ ఫాతిమా కూడా వుందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. దీనిపై ఎంఐఎం ఎందుకు మాట్లాడలేదని సీఎం ప్రశ్నించారు. మొండి బకాయిల విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, ఎంఐఎంలు బాధ్యత తీసుకుంటాయా అని ఆయన నిలదీశారు. 

అనంతరం అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తమను అణచివేసే ప్రయత్నం చేస్తోందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదని, ఎంఐఎం ఎప్పుడు ఎక్కడ పోటీ చేయాలో మా అధినేత నిర్ణయం తీసుకుంటారని అక్బరుద్దీన్ తెలిపారు. ఎంఐఎంను బీజేపీకి బీ టీమ్ అంటున్నారని.. తాము బతికున్నంత వరకు బీజేపీతో కలిసి పనిచేసేది లేదని ఆయన తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఆరోపణ చేశారని.. ముస్లిం హక్కుల కోసమే ఎంఐఎం పోరాడుతుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. 

Latest Videos

ALso Read: న్యూసిటీ, ఓల్డ్ సిటీ అన్న తేడా కాంగ్రెస్‌కు లేదు .. పదే పదే బీఆర్ఎస్‌ను పొగడొద్దు : ఎంఐఎంకు రేవంత్ చురకలు

తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. సిద్ధిపేట, గజ్వేల్ , పాతబస్తీలపై సీఎం రేవంత్ రెడ్డి తన అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. సిద్ధిపేట, గజ్వేల్, పాతబస్తీలో కాంగ్రెస్ గెలవలేదనే ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడరని ఆయన దుయ్యబట్టారు. సిద్ధిపేట, గజ్వేల్ ప్రజలు కరెంట్ బిల్లులు కట్టడం లేదనడం అవాస్తవమని హరీశ్ పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తామంటేనే నాడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని ఆయన గుర్తుచేశారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమేనని.. రేవంత్ రెడ్డి పదవుల కోసమే పార్టీలు మారారని హరీశ్ రావు వెల్లడించారు.

మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడే నాటికి 2,700 మెగావాట్ల విద్యుత్ లోటు వుందన్నారు. శ్వేతపత్రం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకానితనాన్ని బయటపెట్టుకుందని కేటీఆర్ దుయ్యబట్టారు. విజయవాడ , కడపలలో బొగ్గు లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్ట్‌లు కట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. 


 

click me!