వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేయండి.. ఐటీ కంపెనీలకు వైద్యుల సూచన

By telugu news teamFirst Published Sep 14, 2021, 10:51 AM IST
Highlights

ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా.. చాలా మంది మానసిక సమస్యలుఎదుర్కొంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా సంగతి పక్కన పెడితే.. మానసిక సమస్యలతో బాధపడేవారు రోజు రోజుకీ పెరుగుతున్నారని వారు చెబుతున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా.. గతేడాది నుంచి ఆఫీసులన్నీ మూతపడ్డాయి.  అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నారు. అయితే.. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా.. చాలా మంది మానసిక సమస్యలుఎదుర్కొంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా సంగతి పక్కన పెడితే.. మానసిక సమస్యలతో బాధపడేవారు రోజు రోజుకీ పెరుగుతున్నారని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఈ విషయమై మాట్లాడారు.

‘ఐటీ సంస్థలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది బతుకుతున్నారు. కోవిడ్‌ అదుపులో ఉన్నందున ఐటీ సంస్థలు కరోనా నిబంధనలను పాటిస్తూ, గతంలో మాదిరి యథావిధిగా కార్యకలాపాలను నిర్వహించుకోవాలి. వర్క్‌ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలకాలి. ఐటీ శాఖ కూడా ఈ మేరకు ఆయా సంస్థలకు సమాచారమిచ్చింద’ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. 

 లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించి 3 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, ఎక్కడా అసాధారణంగా కేసులు పెరగలేదన్నారు. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లోనూ కరోనా నియంత్రణలోనే ఉందని చెప్పారు. ‘బడులు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు విద్య, వైద్య శాఖలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 40–50 శాతం మంది విద్యార్థులు హాజరవుతుండగా, ప్రైవేటు బడుల్లో 25 శాతం మేరకు హాజరవుతున్నారు. ఎలాంటి భయాందోళన లేకుండా పిల్లల్ని బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరుతున్నా. ఒక్క పాఠశాలలో కూడా ఐదుకు మించి కేసులు నమోదు కాలేదు. 1.10 లక్షల మంది విద్యార్థులను పరీక్షిస్తే వారిలో 55 మందిలో మాత్రమే కరోనా బయటపడింది’అని ఆయన చెప్పారు. ‘హైకోర్టు ఆదేశాలను అనుసరించి వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

కరోనా థర్డ్‌వేవ్‌ వస్తుందని కొన్ని సంస్థలు చెబుతూ వస్తున్నాయి. మూడోదశ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. ‘మొత్తం 27 వేల పడకలకుగాను ఇప్పటికే 19 వేల పడకల్లో ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించాం. ఈ నెలాఖరులోగా మిగిలిన పడకల్లోనూ ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. రూ.138 కోట్ల వ్యయంతో పిల్లల్లో కరోనా చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నాం. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే గాంధీ సహా ఐదు ప్రాంతీయ ఆసుపత్రుల్లో కొత్తగా 792 పడకలను సిద్ధం చేస్తున్నాం. మొత్తంగా బోధనాసుపత్రుల్లో 3,200 పడకలను పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్నాం’అని శ్రీనివాసరావు తెలిపారు.  
 

click me!