తెలంగాణ విద్యుత్‌ సంస్థలకే ఏపీ రూ. 4,457 కోట్లు చెల్లించాలి.. ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు

By AN TeluguFirst Published Sep 14, 2021, 10:48 AM IST
Highlights

ఈ నేపథ్యంలో సీఎండీ ప్రభాకరరావు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ కొన్న కరెంటుకు రూ. 4,887 కోట్లు చెల్లించాల్సి ఉందని చెబుతున్న ఏపీ జెన్‌కో.. తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన ఇతర బకాయిల గురించి మాత్రం మాట్లాడడంలేదని వివరించారు. 

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలే తమకు రూ. 4,457 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి తమకు రావలసిన బాకీలను చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఏపీ జెన్‌కో సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 

ఈ నేపథ్యంలో సీఎండీ ప్రభాకరరావు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ కొన్న కరెంటుకు రూ. 4,887 కోట్లు చెల్లించాల్సి ఉందని చెబుతున్న ఏపీ జెన్‌కో.. తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన ఇతర బకాయిల గురించి మాత్రం మాట్లాడడంలేదని వివరించారు. 

ఉదాహరణకు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విద్యుత్‌ మౌలిక సదుపాయాల కల్పనకు ఉమ్మడి ఏపీలో తీసుకున్న రుణాలు రూ. 2,725 కోట్లను ఇప్పుడు తెలంగాణ చెల్లిస్తోందన్నారు. అలాగే ఏపీ జెన్‌కోలో పెట్టుబడుల వంటి వాటి వాటాల విభజనలో తెలంగాణ జెన్‌కోకు రూ. 3,857 కోట్లు రావలసి ఉందన్నారు. కృష్ణపట్నం విద్యుత్కేంద్రంలో తెలంగాణ డిస్కంలు పెట్టిన పెట్టుబడి సొమ్ము వడ్డీతో సహా రూ. 1,611 కోట్లు రావాలన్నారు. 

ఇలా పలు ఇతర బకాయిలన్నీ కలిపి లెక్కిస్తే వాళ్ల బాకీ పోను నికరంగా తెలంగాణ విద్యుత్‌ సంస్థలకే రూ. 4,457 కోట్లు ఏపీ చెల్లించాల్సి ఉందని ఆయన తెలిపారు. వీటి గురించి అడిగితే ఏపీ విద్యుత్‌ సంస్థలు స్పందించడంలేదన్నారు. తెలంగాణ వాదనలను హైకోర్టుకు వివరిస్తామని తెలిపారు.

click me!