Harvard varsity: హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ..

By Rajesh Karampoori  |  First Published Jan 12, 2024, 12:41 AM IST

Harvard varsity:  తెలంగాణ సీఎంతో హార్వర్డ్ వర్సిటీ ప్రతినిధి బృందం సమావేశమై విద్యా కార్యక్రమాలపై చర్చించింది. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల నాణ్యతను పెంపొందించే లక్ష్యంతో ఏడాదిపాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం, తెలంగాణ మధ్య ఉమ్మడి వెంచర్‌ను ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.


Harvard varsity:   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం కలిసింది. అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పీఎస్‌ఐఎల్‌-24 ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డొమినిక్‌ మావో నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల బలోపేతం, సుసంపన్నం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని సిఎం కోరారు.

జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సహకారంతో హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లోని 100 మంది 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు, 33 జిల్లాల నుండి ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజులపాటు ప్రోగ్రాం ఫర్ సైంటిఫికల్లీ ఇన్‌స్పైర్డ్‌ లీడర్‌షిప్‌ (PSIL-24) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అధ్యాపకులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం ఈ కార్యక్రమం వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎంఎస్ షెఫాలీ ప్రకాష్, డాక్టర్ ఎండీ రైట్ తదితరులు పాల్గొన్నారు.

Latest Videos

click me!