HarithaHaram: 'హరితహారం' అద్భుత ఫలితాలను ఇస్తోంది: సీఎం కేసీఆర్

Published : Sep 11, 2023, 05:01 PM IST
HarithaHaram: 'హరితహారం' అద్భుత ఫలితాలను ఇస్తోంది: సీఎం కేసీఆర్

సారాంశం

Hyderabad: "అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని ఊహించడం క‌ష్టం. అందుకే పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన వెంటనే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించింది. హ‌రిత‌హారంతో కేవలం దశాబ్ద కాలంలోనే ప్రభుత్వ నిబద్ధత, పట్టుదలకు తగిన ఫలితాలను తీసుకురావ‌డం నేడు మ‌నం చూస్తున్నామని" తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ అన్నారు.  

CM KCR comments on Haritha Haram: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల సహకారంతో అడవుల పునరుద్ధరణ, పచ్చదనాన్ని పెంచడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. ఈ దిశగా రాష్ట్ర అటవీ శాఖ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సెప్టెంబర్ 11న అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయన తన సందేశంలో తెలంగాణ రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం.. హరితహారం లక్ష్యాన్ని సాధించే వరకు అందరం కలిసి పనిచేద్దామ‌ని పిలుపునిచ్చారు.

అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని ఊహించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన వెంటనే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించిందని తెలిపారు.  కేవలం దశాబ్ద కాలంలోనే ప్రభుత్వ నిబద్ధత, పట్టుదలకు తగిన ఫలితాలను నేడు చూస్తున్నామని అన్నారు. ఇటీవల అనేక నిర్మాణ కార్యకలాపాలతో కాంక్రీట్ జంగిల్ గా అవతరించిన నగరంలో పచ్చదనాన్ని పెంపొందించినందుకు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ అందించే "వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు - 2022"ను హైదరాబాద్ నగరం గెలుచుకుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రకృతి పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఉండాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కొంటున్నామని చెప్పారు. మన కోసం, భవిష్యత్ తరాల కోసం భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అటవీశాఖకు చెందిన 22 మంది అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని కేసీఆర్ పేర్కొన్నారు. "అడవులను కాపాడే మిషన్ మోడ్ లో విధులు నిర్వర్తించిన అమరవీరులకు నా హృదయపూర్వక నివాళులు.. వారి నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకం. వారి ఆకాంక్షలను సజీవంగా ఉంచడానికి మనమందరం 'జంగిల్ బచావో - జంగిల్ బడావో' నినాదాన్ని అత్యంత అంకితభావంతో సాధించాలి. ఈ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని" పిలుపునిచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి