Telangana: కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందు హ‌రీష్ రావు.. 40 నిమిషాల పాటు సాగిన విచార‌ణ

Published : Jun 09, 2025, 07:02 PM IST
Harish Rao, BRS

సారాంశం

తెలంగాణ‌ కాళేశ్వ‌రం ప్రాజెక్టులో వ‌చ్చిన‌ అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ విచార‌ణ జ‌రుపుతోంది. ఇప్ప‌టికే ఈట‌ల రాజేంద‌ర్‌ను విచారించిన క‌మిష‌న్ తాజాగా హ‌రీష్ రావును విచారించింది.

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ విషయంలో కొనసాగుతున్న విమర్శలపై మాజీ మంత్రి హరీశ్ రావు సమాధానాలు ఇచ్చారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఎదుట హాజరైన ఆయన, దాదాపు 40 నిమిషాల పాటు విచారణ ఎదుర్కొన్నారు. ప్రాజెక్టు మార్పులపై పూర్తి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

రీడిజైన్ అవసరం ఎందుకొచ్చింది?

హరీశ్ రావు వ్యాఖ్యల ప్రకారం, తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉండటం, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్లే ప్రాజెక్టు డిజైన్ మార్చాల్సి వచ్చిందని చెప్పారు. వాస్కోప్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదికల ఆధారంగా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తులు చేసినా అనుమతులు రాకపోవడం వల్లే ప్రత్యామ్నాయ మార్గం అనుసరించాల్సి వచ్చిందని వివరించారు. కేంద్రీయ జల సంఘం (CWC) రెండు లేఖల ద్వారా తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు హరీశ్ రావు తెలిపారు.

బ్యారేజీల నిర్మాణంపై వివరణ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గ అనుమతి ఉందని తెలిపారు. ఈ బ్యారేజీల స్థలాల్లో మార్పులు జలవనరుల శాఖ ఇంజినీర్ల సలహాల మేరకే జరిగాయని వెల్లడించారు. ప్రాజెక్టులో భాగంగా నీటి నిల్వ, పంపింగ్, రహదారుల మార్గాలు ఇంజ‌నీరింగ్ సంబంధిత అంశాలేన‌ని, ప్రభుత్వ నియంత్రణ కంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ల సూచనలే కీలకమని తెలిపారు.

కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుపై వివరణ

ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ఇది రాష్ట్ర క్యాబినెట్ అనుమతి, ప్రభుత్వ హామీతో జరిగింది అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల నుంచే రుణాలు పొందినట్టు పేర్కొన్నారు.

విచార‌ణ స‌మ‌యంలో ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పానన్న హ‌రీష్‌.. తమ్మిడిహట్టి వద్ద ప్రయత్నాలు విఫలమైన తర్వాతే మేడిగడ్డ వద్దకు మార్చిన‌ట్లు తెలిపారు. నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ లేఖల ఆధారంగా మార్పులు చేయాల్సి వచ్చింద‌న్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సీఐడీ విచారణకు Padi Kaushik Reddy | Sammakka-Saralamma Jatara Case | BRS MLA | Asianet News Telugu
CM Revanth Reddy Speech: ఈలోపం దేశ భవిష్యత్తుకు చాలాఇబ్బందికరం | AI Challenges | Asianet News Telugu