హరీష్ ఎటు పోయిండబ్బా ?

First Published Dec 19, 2017, 5:08 PM IST
Highlights
  • తెలుగు మహాసభల వేడుకల్లో కనిపించని హరీష్
  • రాష్ట్రపతి స్వాగత కార్యక్రమానికీ దూరం

తెలంగాణ సిఎం మేనల్లుడు, ఇరిగేషన్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు ఒక కీలక కార్యక్రమానికి మళ్లీ దూరమయ్యారు. కారణాలేమైనా ఆయన దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకూ హరీష్ దూరంగా ఉన్న తెలంగాణ సర్కారు వారి కార్యక్రమం ఏమిటబ్బా అనుకుంటున్నారా? ఈ వార్త చదవండి.

తెలంగాణ సర్కారు అత్యంత భారీగా, అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలను జరుపుతోంది. ఆరంభ వేడుకలు ఉపరాష్ట్రపతితో ముగింపు వేడుకలు రాష్ట్రపతి చేత ప్లాన్ చేసింది. ఐదురోజులపాటు అంగరంగ వైభవంగా సభలు జరిగాయి. సినీ తారలు కూడా వేడుకల్లో పాల్గొని మరింత గ్లామర్ పెంచారు. అయితే ఆ ఒక్క లోటు మాత్రం కనిపిస్తూనే ఉంది. అదేమంటే ఈ వేడుకల్లో మంత్రి హరీష్ రావు ఎక్కడా కనిపించలేదు. ఆయన ఉద్దేశపూర్వకంగా రాలేదా? వర్క్ బిజీ కారణంగా రాలేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ కేబినెట్ మంత్రులందరూ దాదాపుగా పాల్గొన్నారు. మంత్రి కేటిఆర్ ఈ వేడుకల్లో బాగానే హడావిడి చేశారు. మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, అవంచ లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి కేబినెట్ మంత్రులంతా హాజరయ్యారు. ఒక్కో కార్యక్రమంలో ఒక్కొక్కరు పాల్గొని వేడుకలు విజయవంతం చేశారు. కానీ హరీష్ రావు మాత్రం ఎల్బీ స్టేడియంలో కాలు పెట్టలేదు.. ప్రపంచ తెలుగు మహాసభల వేడుకలు, వేదికలు పంచుకోలేకపోయారు. సభలు షురూ కాకముందు ఒకసారి పోస్టర్ మాత్రం రిలీజ్ చేశారు అంతే.

ఇక ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రాంనాద్ కోవింద్ హాజరయ్యారు. ఆయనకు సిఎం కేసిఆర్ తో పాటు కేబినెట్ సభ్యులంతా హాజరై స్వాగతం పలికారు. ఇక్కడ కూడా హరీష్ రావు హాజరు కాలేదు. అయితే ఆయన ఢిల్లీలో సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ఉన్నారని ఆయన పేషీ నుంచి అధికార వర్గాలు సమాచారం ఇచ్చాయి. కాలేశ్వరం ప్రాజెక్టుతోపాటు సీతారామ ప్రాజెక్టు అనుమతుల విషయంలో హరీష్ ఢిల్లీలో బిజీగా ఉన్నట్లు చెప్పాయి. అయితే గతంలో మెట్రో రైలు ఓపెనింగ్ సందర్భంగా  కూడా సేమ్ ఇలాంటి సీన్ జరిగింది. మంత్రి హరీష్ రావు అప్పుడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ కేబినెట్ మంత్రులంతా స్వాగతం పలికారు.. హరీష్ రావు, చందూలాల్ తప్ప. అప్పట్లోనూ ఈ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

 

అయితే హరీష్ రావుతో ఎలాంటి విభేదాలు లేవని, ఆయన సాగునీటి ప్రాజెక్టులే లక్ష్యంగా పనిచేస్తున్నారని టిఆర్ఎస్ కు చెందిన ఒక కీలక నేత ఏషియానెట్ కు చెప్పారు. ఇందులో హరీష్ రావు విభేదాలొచ్చి దూరంగా ఉన్నారని, దూరంగా ఉంచుతున్నారన్న మాటల్లో ఏమాత్రం వాస్తవంలేదన్నారు. ఎవరేమిటో ఉద్యమనేత, సిఎం కేసిఆర్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి కీలక పరిణామాలు జరిగినప్పుడల్లా హరీష్ రావు వార్తల్లో నిలుస్తున్నారు.

 

click me!