ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు మధ్యాహ్నం వరకే పని చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే స్కూళ్లు నడవాలని విద్యా శాఖ అధికారులు ఆదేశించారు.
Half Day School: వేసవి భానుడి భగభగలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ పిల్లలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట వరకే క్లాసులు చెప్పాలని పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే స్కూళ్లు పని చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 12.30 గంటల వరకు మధ్యాహ్న భోజనం పెట్టాలని తెలిపారు. విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు.
ఈ ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు కూడా ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూటే పని చేయాలని తెలిపారు.
ఇక పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న కేంద్రాల్లో పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు పని చేస్తాయని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు.